Security Forces Hunt for Top Maoist Leaders: మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకులు గణపతి, మిసిర్ బెస్రా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. వీరి కోసం భద్రతా బలగాలు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో దాదాపు 5 వేల మంది సిబ్బంది శోధనలో పాల్గొంటున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయంపై అధికారులకు స్పష్టమైన సమాచారం లేదు.
జార్ఖండ్ అడవుల్లో మరింత గాలింపు
మిసిర్ బెస్రా జార్ఖండ్ అడవుల్లో ఉన్నాడనే అనుమానంతో పరందా ప్రాంతంలో గాలింపును మరింత పెంచారు. గణపతి పరిస్థితి విషయంలో ఇంకా అనిశ్చితి నెలకొంది. అతను ఎక్కడ ఉన్నాడు? ఇంకా బతికే ఉన్నాడా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. మాజీ మావోయిస్టులు కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఇద్దరు నేతలతో కలిసి 30 నుంచి 60 మంది మావోయిస్టులు ఉండే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవల జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా పరందా అడవుల్లో కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్ బలగాలు మరియు మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో కోబ్రా 205 బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సత్యప్రకాశ్‌తో పాటు మరికొందరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. అయితే మిసిర్ బెస్రా బృందం అక్కడి నుంచి తప్పించుకున్నట్లు భావిస్తున్నారు.
దండకారణ్యంలో కూబింగ్ ఆపరేషన్లు
ఇక ఛత్తీస్‌గఢ్‌లో కూడా భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. దండకారణ్యం ప్రాంతంలో కూబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మాజీ మావోయిస్టుల సహాయంతో ఈ పేలుడు పదార్థాలను గుర్తిస్తూ నిర్వీర్యం చేస్తున్నారు. అదేవిధంగా అడవుల్లో ఉన్న మావోయిస్టుల డంప్‌లపై కూడా దృష్టి సారించారు. అటు జార్ఖండ్‌లోని హజారీబాగ్ అడవుల్లో కోబ్రా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కీలక స్థాయి సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి ఆధునిక ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.