Homeవైరల్హాస్టల్ మెస్‌లోకి మొసలి ఎంట్రీ… విద్యార్థుల్లో కలకలం: వీడియో వైరల్

హాస్టల్ మెస్‌లోకి మొసలి ఎంట్రీ… విద్యార్థుల్లో కలకలం: వీడియో వైరల్

రాజస్థాన్‌లోని కోటలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బాయ్స్ హాస్టల్ మెస్‌లోకి మొసలి చొరబడటంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

కోటలోని కోరల్ పార్క్ పరిసరాల్లో ఉన్న ఓ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్న సమయంలో మెస్‌లో వంట పనులు సాగుతుండగా ఆకస్మికంగా ఒక మొసలి లోపలికి వచ్చింది. దాన్ని గమనించిన సిబ్బంది, వంట కార్మికులు భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. మెస్‌లోకి వచ్చిన మొసలి కొంతసేపు అక్కడే కదలకుండా ఉండిపోయింది.

ఈ విషయం బయటకు రావడంతో హాస్టల్ విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొంతమంది విద్యార్థులు మొసలిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జాగ్రత్తగా మొసలిని పట్టుకుని అక్కడినుంచి తరలించారు. హాస్టల్ పక్కనే ఉన్న మురుగు కాలువ నుంచి మొసలి బయటకు వచ్చి బేస్‌మెంట్‌లో ఉన్న మెస్‌లోకి చేరి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

also read: రేపు తిరుమలలో పల్లవోత్సవం: మలయప్ప స్వామివారి ప్రత్యేక వేంచేపు

తాజావార్తలు