రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. బిల్లులో అదనంగా విధించిన ఛార్జీలను ప్రశ్నించడంతో తలెత్తిన వివాదం చివరకు దాడి ఆరోపణలకు దారితీసింది. హైదరాబాద్ నారాయణగూడలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హిమాయత్‌నగర్‌కు చెందిన ఆశిష్ పోర్వాల్ తన సోదరుడు రాహుల్, సోదరి కీర్తితో కలిసి రాఖీ వేడుకలు నిర్వహించారు. అనంతరం కుటుంబంలోని మరో 15 నుంచి 20 మందితో కలిసి నారాయణగూడలోని రత్నదీప్ పరిధిలో ఉన్న ‘భట్టడ్ కీ ఇడ్లీ’ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఉదయం సుమారు 10.30 గంటలకు రెస్టారెంట్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.
భోజనం అనంతరం రెస్టారెంట్ సిబ్బంది రూ.5 వేల బిల్లు ఇచ్చారని ఆశిష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ మొత్తానికి అదనంగా రూ.3 వేల ‘వెయిటింగ్, డెలివరీ ఛార్జీ’ జోడించారని ఆరోపించారు. ఈ అదనపు ఛార్జీ గురించి ముందుగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించడంతో రెస్టారెంట్ యాజమాన్యంతో వాగ్వాదం జరిగినట్లు తెలిపారు.
బిల్లు చెల్లించిన తర్వాత జరిగిన సంభాషణను తన ఫోన్లో రికార్డు చేసేందుకు ప్రయత్నించగా యజమాని యోగేశ్ భట్టడ్, సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించి బయటకు పంపించారని ఆశిష్ ఆరోపించారు. ఈ క్రమంలో యజమాని సోదరుడు రితేష్ భట్టడ్ తన సోదరుడు రాహుల్‌పై దాడి చేయడంతో గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన సోదరి కీర్తిని సిబ్బంది చేయి పట్టుకుని లాగారని, ఆమెతో అనుచితంగా ప్రవర్తించారని ఆశిష్ ఆరోపించారు. తన గొంతు పట్టుకుని కొంతసేపు ఊపిరాడకుండా చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు సోదరసోదరీమణులకు గాయాలైనట్లు ఆయన తెలిపారు.
సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడి సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సేకరించడంతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. గాయాలకు సంబంధించిన ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు.
ఆశిష్ ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్లోని 74, 115(2), 352, 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రెస్టారెంట్లో జరిగిన పూర్తి ఘటనపై సీసీటీవీ దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలు, పోలీసుల దర్యాప్తు అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
also read: బిల్లు చెల్లించలేకపోయిన మహిళకు షాకింగ్ శిక్ష.. గుండు కొట్టించిన బార్ యాజమాన్యం
