అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి నాలుగు స్వర్ణ పతకాలు సాధించిన త్రోబాల్ క్రీడాకారుడు అమర్దీప్ కుమార్ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు దేశం కోసం పతకాలు సాధించిన ఈ క్రీడాకారుడు ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం రాంచీలోని అర్గోడా చౌక్‌లో కూరగాయలు విక్రయిస్తున్నట్లు సమాచారం.
క్రీడల్లో ప్రతిభను చాటుకున్నప్పటికీ తనకు తగిన స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించలేదని అమర్దీప్ చెబుతున్నాడు. క్రీడా కోటా కింద ఉద్యోగం కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు శాశ్వత ఉద్యోగం దక్కలేదని పేర్కొన్నాడు. దీంతో కుటుంబ అవసరాలను తీర్చేందుకు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు.
అమర్దీప్ పరిస్థితి కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయం కాదని తెలుస్తోంది. 2020లోనూ ఆయన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారనే వార్తలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇన్నేళ్లు గడిచినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించకపోవడం ఇప్పుడు మరోసారి చర్చకు దారితీస్తోంది.
దేశం కోసం అంతర్జాతీయ వేదికపై పతకాలు సాధించిన క్రీడాకారులకు కెరీర్ అనంతరం సరైన ప్రోత్సాహం, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక భద్రత ఎంతవరకు అందుతున్నాయనే ప్రశ్నలు ఈ ఘటనతో ముందుకొస్తున్నాయి. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పతకాలు సాధించిన క్రీడాకారుడి ప్రస్తుత పరిస్థితి.. క్రీడా రంగంలో ప్రతిభకు లభిస్తున్న అవకాశాలపై మరోసారి ఆలోచించేలా చేస్తోంది.
also read: ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం.. రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
