టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 20వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తనయుడి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మహేశ్.. గౌతమ్ కొత్త జీవిత దశలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రేమతో కూడిన సందేశాన్ని పంచుకున్నారు.
గౌతమ్ తన లక్ష్యాల దిశగా ధైర్యంగా ముందుకు సాగాలని, అదే సమయంలో మంచి మనసుతో జీవితాన్ని కొనసాగించాలని మహేశ్ ఆకాంక్షించారు. తన కుమారుడిని చూసి ఈ రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజూ గర్వపడుతున్నానంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా గౌతమ్ కూడా తన తండ్రికి సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ తెలిపాడు. తన తండ్రికి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతూ ప్రేమను వ్యక్తం చేశాడు.
మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందించిన శుభాకాంక్షలకు మహేశ్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ప్రేమ తన హృదయాన్ని ఆనందంతో నింపిందని పేర్కొన్నారు.
అదే సమయంలో తన తదుపరి ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి కూడా మహేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైనదని, ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తనకు తెలుసని, వారిని గర్వపడేలా చేసేందుకు మరింత కష్టపడి పనిచేస్తానని తెలిపారు.
‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణ కథకు భిన్నంగా, విస్తృతమైన నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అనేక ప్రదేశాలు, విభిన్న కాలపరిధులను కలుపుతూ సాగే భారీ అడ్వెంచర్ కథగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. భారతదేశంలోని గంగా తీర ప్రాంతం నుంచి ప్రపంచంలోని పలు సాహసోపేతమైన ప్రదేశాల వరకు కథనం విస్తరించనుందని సమాచారం. మహేశ్ బాబు కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందనే అంచనాలతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
