జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ప్రశ్నించేందుకు వెళ్లిన ఓ కానిస్టేబుల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపింది.
దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రెండు లారీలు ఢీకొన్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అదే సమయంలో సమీపంలోని బస్సు షెల్టర్‌లో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు వారిని ప్రశ్నించేందుకు వారి వద్దకు వెళ్లారు. పోలీసులను గమనించిన వెంటనే వారిలో ఇద్దరు అక్కడి నుంచి పరుగులు తీశారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో వెంకటేశ్వరరావు కడుపులో చాకుతో పొడిచి నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారు అక్కడ ఎందుకు ఉన్నారు? కానిస్టేబుల్‌పై దాడికి కారణమేంటి? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
also read: కాలిఫోర్నియాలో కేరళకు చెందిన ఇద్దరు మహిళల దారుణ హత్య.. స్నేహితురాలిపైనే అనుమానం
