-శ్రీకాకుళం జిల్లాలో వరుస పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన
-భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో మారిన పరిస్థితి
-సైలెంట్ మోడ్ లోకి సీనియర్ నేతలు
-అయోమయంలో పార్టీ శ్రేణులు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్రాది ప్రత్యేక స్థానం. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ ప్రాంతం కీలకం. 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో పట్టు కోసం ప్రతి పార్టీ ప్రయత్నిస్తుంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కూటమి గణనీయంగా తన బలాన్ని పెంచుకున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర తాజా పరిస్థితులతో సీనియర్లుగా ఉన్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాసు, తమ్మినేని సీతారాం సైలెంట్ మోడ్ లోకి వెళ్లి పోయినట్లు ప్రచారం సాగుతోంది.
నేతల వ్యవహార శైలితో..
శ్రీకాకుళం జిల్లాలో మాజీమంత్రి డాక్టర్ అప్పలరాజు అరెస్ట్ పర్వంలో అనేక ట్విస్టులు కొనసాగాయి. ఓ సాధారణ రోడ్డు ప్రమాదంలో ఓ మనిషి చావుకు కారణమయ్యారు కుమారుడు. గౌరవంగా తన కుమారుడ్ని పోలీసులకు అప్పగించి ఉంటే బాగుండేది. కానీ కేసును తారుమారు చేసే క్రమంలో అడ్డంగా బుక్కయ్యారు అప్పలరాజు. ఆయనను సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు శ్రీకాకుళం వచ్చారు. జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ మరింత పలుచనా అయ్యారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓ మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో ఆ ఇంచార్జ్తోపాటు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జరిగిన పరిణామాలు శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ పార్టీ గ్రాఫ్ ను అమాంతం పడేసాయి. మరోవైపు ఓ వివాదంలో చిక్కుకున్నారు మాజీ మంత్రి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. కుటుంబంతో సహా పరారైనట్లు వార్తలు వచ్చాయి. ముందస్తు బెయిల్ లభించడంతో అరెస్టుల బాధ నుంచి తప్పించుకున్నారు. ఈ మొత్తం పరిణామాలు శ్రీకాకుళం జిల్లాలో పార్టీని పూర్తిగా ఇరకాటంలో పడే సాయి. ధర్మాన సోదరులు వ్యూహాత్మక సైలెన్స్ పాటించాల్సి వచ్చింది.
కూటమికి పాజిటివ్..
మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కావడంతో విజయనగరం జిల్లాలో పూర్తిగా సీన్ మారిపోయింది. సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయడంతో ఆ జిల్లా వాసులు పులకించుకుపోయారు. టిడిపి కూటమి గ్రాఫ్ జిల్లాలో పెరగగా.. వైయస్సార్ కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. మరోవైపు విశాఖ జిల్లాలో సైతం వైసిపి బలం పుంజుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆ పార్టీకి అక్కడ ఏం కలిసి రావడం లేదు. పేరు మోసిన నేతలంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అధికారం అనుభవించిన నాయకులంతా సైడయ్యారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంతో ముందుకు సాగుతోంది పార్టీ. ఇలా ఉత్తరాంధ్రలో ఆ పార్టీ గ్రాఫ్ తగ్గుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
