Friday, March 6, 2026
HomeజాతీయంRagi Ambali: వేసవి అలసటకు చెక్ పెట్టే ‘రాగి గంజి’

Ragi Ambali: వేసవి అలసటకు చెక్ పెట్టే ‘రాగి గంజి’

Ragi Ambali: వేసవి కాలం మొదలైతే చాలు.. ఉదయం లేవగానే అలసట, మధ్యాహ్నానికి నీరసం, సాయంత్రానికి శక్తిలేమి అనే సమస్యలు చాలామందిని వెంటాడుతుంటాయి. ఎండ తీవ్రత పెరిగేకొద్దీ శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అధిక చెమటతో ఖనిజలవణాలు బయటకు వెళ్లిపోవడం వల్ల శక్తి స్థాయిలు పడిపోతాయి. చిన్న పని చేసినా అలసటగా అనిపించడం, తలనొప్పి, తల తిరగడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి చల్లదనం ఇచ్చే, పొట్ట నిండేలా చేసే, ఒకేసారి శక్తిని అందించే ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో చాలామంది రాగి జావను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈసారి ఎప్పటిలా సాదాసీదాగా కాకుండా మన అమ్మమ్మలు, నానమ్మలు సంప్రదాయంగా చేసుకునే విధంగా రాత్రంతా నానబెట్టి తయారు చేసే రాగి గంజిని ప్రయత్నిస్తే ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

రాగి అనేది కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాల నిలయం. ముఖ్యంగా వేసవిలో శరీరానికి చల్లదనం ఇవ్వడంలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. నేరుగా పిండిని కలిపి జావ చేసుకోవడం కన్నా, రాత్రంతా నీటిలో నానబెట్టి తయారు చేయడం వల్ల అందులో సహజసిద్ధంగా ప్రోబయోటిక్స్ అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రోబయోటిక్స్ మన ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి జీర్ణక్రియను సక్రమంగా నడిపించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంలోని మంచిన బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తాయి. దీంతో పొట్ట నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పెద్దవారు ఈ విధానాన్నే అనుసరిస్తూ రోజువారీ ఆహారంలో భాగంగా రాగి గంజిని తీసుకుంటుండటం విశేషం.

తయారీ విధానం కూడా ఎంతో సులభం. ముందుగా పావు కప్పు రాగి పిండిని తీసుకుని తగినంత నీటిలో బాగా కలిపి ముద్దలు లేకుండా చేయాలి. ఆ మిశ్రమాన్ని మూతపెట్టి రాత్రంతా గది ఉష్ణోగ్రతలో పక్కన ఉంచాలి. మరుసటి రోజు ఉదయం పైభాగంలో ఏర్పడిన నురగను జాగ్రత్తగా తొలగించాలి. ఇది ఫర్మెంటేషన్ ప్రక్రియలో భాగంగా ఏర్పడుతుంది. ఆ తర్వాత ఒక గిన్నెలో మూడు కప్పుల నీటిని పోసి మరిగించాలి. నీరు వేడెక్కిన తర్వాత నానబెట్టిన రాగి మిశ్రమాన్ని అందులో జాగ్రత్తగా కలుపుతూ పోయాలి. మంటను మీడియం స్థాయిలో ఉంచి సుమారు 15 నిమిషాల పాటు నిరంతరం కలుపుతూ ఉడికించాలి. ముద్దలా చిక్కబడిన తర్వాత మంట ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి.

చల్లారిన రాగి మిశ్రమంలో తగినంత చిక్కటి పెరుగు కలిపితే రుచి మరింత పెరుగుతుంది. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగులు, తాజా కొత్తిమీర వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు జోడించి బాగా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. మరింత చల్లదనం కోసం కొద్దిగా నీరు లేదా మజ్జిగ కలిపి తాగవచ్చు. ఇలా తయారు చేసిన రాగి గంజి శరీరానికి తక్షణ శక్తినిచ్చేలా పనిచేయడంతో పాటు పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడంలో ఇది సహాయకారి. అంతేకాకుండా బరువు నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది. సంప్రదాయ రుచితో పాటు ఆరోగ్యాన్ని కాపాడే ఈ రాగి గంజి నిజంగా ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఆహారంగా చెప్పుకోవచ్చు.

వేసవి అలసటకు చెక్ పెట్టాలంటే ఖరీదైన ఎనర్జీ డ్రింక్స్ అవసరం లేదు. మన వంటింట్లోనే లభించే రాగితో సులభంగా తయారయ్యే ఈ గంజి సరిపోతుంది. ఒకసారి ఈ విధానంలో తయారు చేసి చూసినవారు మళ్లీ మళ్లీ ఇదే రుచిని ఆస్వాదించాలనుకుంటారనడంలో సందేహం లేదు.

ALSO READ: 8 ఏళ్ల బాలికపై అన్నదమ్ములు అత్యాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments