-
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
మున్సిపాలిటీలు / నగరపాలక సంస్థల్లో నామినేటెడ్ పోస్టులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ, సామాజిక చరిత్రలో ఒక సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.. సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ క్యాబినెట్ అత్యంత సాహసవంతమైన నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రతి మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక ట్రాన్స్ జెండర్ ప్రతినిధిని నామినేటెడ్ సభ్యుడిగా, సభ్యురాలిగా నియమించాలని క్యాబినెట్ అధికారికంగా తీర్మానించింది. దీనికి సంబంధించి తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019కి అవసరమైన సవరణలు చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
-
ఆరో కో ఆఫ్టేడ్ సభ్యుడు..
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రతి మున్సిపాలిటీ / కార్పొరేషన్ లో ఐదుగురు కో ఆప్టేడ్ సభ్యులు ఉండగా… ఇప్పుడు ఆరో సభ్యుడుకు పెంచుతూ ప్రభుత్వం సవరణ చేయనుంది. అలా పెంచిన అదనపు స్థానాన్ని పూర్తిగా ట్రాన్స్ జెండర్లకే రిజర్వ్ చేయనున్నారు. స్థానిక సంస్థల్లో మైనారిటీలకు ఇచ్చే ప్రాతినిధ్యం తరహాలోనే.. సమాజంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్న ఆ వర్గానికి చట్టసభల్లో, నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం కల్పించాలని ఉన్నతమైన ఆశయంతోనే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా స్థానిక పట్టణాభివృద్ధి ప్రణాళికలో వారి గొంతుక వినబడనుంది. అయితే ఇది ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు. సమాజంలో కొన్ని శతాబ్దాలుగా వివక్షకు గురవుతున్న ఒక వ్యవస్థ పై అద్భుతమైన ప్రయోగం చేసినట్టే.
-
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామకం..
ఇప్పటికే ట్రాన్స్ జెండర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అమలు చేస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా వారికి ఉపాధి కల్పించింది. పలు ప్రభుత్వ విభాగాల్లో వారికి ప్రాధాన్యత దక్కుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ నుంచి ఒక ట్రాన్స్ జెండర్ కౌన్సిలర్ గా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఆస్ఫూర్తిని మరింతగా ముందుకు తీసుకెళ్తూ.. ఎన్నికల్లో పోటీ చేసే ఆర్థిక శక్తి లేని వారికి కూడా నామినేటెడ్ పద్ధతిలో పదవి ఇచ్చి గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది గొప్ప నిర్ణయం అని మేధావులు అభిప్రాయపడుతున్నారు.