జగిత్యాల,క్రైమ్ మిర్రర్:- ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిన అత్యంత కీలకమైన భూ రికార్డులు.. కల్లు దుకాణంలో ప్రత్యక్షమవ్వడం జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. మల్యాల మండల కేంద్రంలో వెలుగుచూసిన ఈ ఘోర నిర్వాకం రెవెన్యూ శాఖలోని నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది.
అసలేం జరిగిందంటే..? మల్యాల మండల కేంద్రంలోని ఒక కల్లు మండువా (కల్లు కాంపౌండ్) లో స్థానికులు కల్లు తాగుతుండగా, అక్కడ ఒక ప్రభుత్వ అధికారిక రికార్డు పుస్తకం కనిపించింది. దాన్ని పరిశీలించగా.. అది మల్యాల మండలానికి చెందిన అత్యంత కీలకమైన ‘పహాణీ రికార్డు’ (భూముల వివరాల బుక్) అని తేలింది.కార్యాలయంలో భద్రంగా దాచాల్సిన ప్రభుత్వ ఆస్తులను, భూముల రికార్డులను ఇలా బాధ్యతారాహిత్యంగా కల్లు దుకాణానికి తీసుకురావడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు మండువాలో పహాణీ బుక్ ఉన్న దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జిల్లావ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది.
రంగంలోకి దిగిన అధికారులు..
ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో రెవెన్యూ శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ప్రభుత్వ రికార్డులను కల్లు కాంపౌండ్‌కు ఎవరు తీసుకెళ్లారు? దీని వెనుక ఏవైనా భూ అక్రమాల కోణం ఉందా? లేదా ఏదైనా రెవెన్యూ సిబ్బంది మద్యం మత్తులో ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.రైతుల జీవితాలకు, భూములకు సంబంధించిన కీలకమైన పహాణీ రికార్డులను కల్లు దుకాణాల్లో వదిలేసే స్థాయికి రెవెన్యూ వ్యవస్థ దిగజారిపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి అసలు నిజాలను బయటపెట్టాల్సి ఉంది.
నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదు: మాజీ మంత్రి అమర్‌నాథ్!