క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : గత వైసిపి ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రుషికొండ భవన నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రుషికొండ భవనాలను క్షుణ్ణంగా పరిశీలించిన కేబినెట్ సబ్ కమిటీ.. స్వయంగా ప్యాలెస్ అంతటా కలియ తిరిగి అంతర్గత వసతులను తనిఖీ చేసింది. ఈ కమిటీలో సభ్యులు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి భవనాల వినియోగంపై యాత్రి నివాస్ లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం ఋషికొండకు ఆనుకుని ఉన్న భూమలను కూడా పరిశీలించారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామనీ మంత్రుల బృందం వెల్లడించింది. సుమారు 450 కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రజాధనం వృథా కాకుండా పీపీపీ విధానంలో లగ్జరీ రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కేబినెట్ ద్వారా అంతిమ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆసక్తి ఉన్న సంస్థలు, అర్హత పరిశీలించాక రుషికొండ భవనాల వినియోగంపై సీఎంకు నివేదిక సమర్పించనున్నారు.
పిపిపి విధానంలో అంతర్జాతీయ లగ్జరీ రిసార్ట్ గా…
గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా నిర్మించిన రుషికొండ భవన సముదాయాన్ని (ప్యాలెస్) వందల కోట్ల ప్రజాధనం వృథా కాకుండా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్‌గా మార్చాలని, ప్రజల సందర్శనార్థం వినియోగించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ భవనాలను కూల్చివేయకుండా, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా ‘హాస్పిటాలిటీ’ రంగానికి కేటాయించడమే సముచితమైన మార్గమని కమిటీ అభిప్రాయపడింది. వైజాగ్ వాసుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ప్రజల సందర్శనార్థం ఒక బ్లాక్‌ను కల్చరల్ లేదా హెరిటేజ్ సెంటర్‌గా ఉంచేలా రూపొందించిన ఈ నివేదికను అంతిమ నిర్ణయం కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే కేబినెట్ ముందుకు త్వరలోనే తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మంత్రుల బృందం ప్యాలెస్‌లోని ప్రతి బ్లాక్‌ను, ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. భవనాల లోపల అమర్చిన ఖరీదైన టైల్స్, బెడ్స్, ఫర్నీచర్, బాత్ టబ్స్, కమోడ్స్ వంటి అంతర్గత వసతులను, నిర్మాణ శైలిని పరిశీలించింది. అనంతరం భవనాలకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలిస్తూ ఒక్కో బ్లాక్ రూపకల్పన, వాటి ప్రస్తుత స్థితిగతులను పర్యాటక శాఖ ఇంజినీర్ అధికారులను, రెవెన్యూ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పర్యటనలో భాగంగా రుషికొండ ప్యాలెస్‌తో పాటు, ఆ పరిసర ప్రాంతాల్లో మరియు బీచ్ రోడ్డుకు ఆనుకుని అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను కూడా కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భవనాల భవిష్యత్తు వినియోగంపై విశాఖపట్నంలోని యాత్రి నివాస్ లో మంత్రుల బృందం పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు. భవనాల భవిష్యత్తు వినియోగంపై ప్రజల ప్రయోజనాలు, ప్రభుత్వ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారుల నుంచి వివరాలు కమిటీ సేకరిస్తోంది. ఇప్పటికే ప్రఖ్యాత సంస్థలతో చర్చించామని, ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించామని మంత్రుల బృందం వెల్లడించింది. ప్రజల నుండి పిచ్చాసుపత్రి, మ్యూజియం, ప్లానిటోరియం, కల్చరల్ హెరిటేజ్ సెంటర్, స్టేట్ గెస్ట్ హౌస్‌గా మార్చాలని, కొందరు కూల్చివేయాలని కూడా విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. ప్రజాధనం ఎలా వృథా చేశారో చూపించడానికి టికెట్ పెట్టి ప్రజలను, స్కూల్ పిల్లలను సందర్శనకు అనుమతించాలని కొందరు కోరినట్లు మంత్రుల బృందం వివరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతగా ఆలోచించారని పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీ మినిమం మెయింటెనెన్స్‌కే నెలకు రూ.25 లక్షలు, దాని లావిష్‌నెస్‌ను అలాగే మెయింటెన్ చేయాలంటే దాదాపు రూ.1.5 కోట్లు అవుతుందని తెలిపారు. కాబట్టి మెజార్టీ అభిప్రాయం మేరకు దీనిని ‘రిసార్ట్’ (హాస్పిటాలిటీ) గా కొనసాగించడమే సముచితమని జీఓఎం భావిస్తోందన్నారు. ఈ ప్యాలెస్‌ను అంతర్జాతీయ స్థాయి రిసార్ట్‌గా మార్చే క్రమంలో ఇప్పటికే తాజ్, టాటా, ఫెమా, లీలా, ఎట్మోస్పియర్ కోర్ వంటి పలు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపించాయని మంత్రులు వెల్లడించారు. అయితే రుషికొండ కింద ఉన్న భూమి కూడా ఇస్తే కలిపి డెవలప్ చేస్తామని అడిగారన్నారు. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ ఇచ్చి, ఆసక్తి గల సంస్థలను ఆహ్వానిస్తామన్నారు. నిబంధనల ప్రకారం ఎలిజిబులిటీస్, రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (RFQ) పరిశీలించి, మినిమం క్వాలిఫికేషన్స్ మరియు టైమ్ ఫ్రేమ్ పెట్టి కేటాయిస్తామన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు మాత్రమే చేస్తుందిని, తాము నిర్ణేతలం కాదని, ఈ ప్రతిపాదనలను సీఎంకు వివరించి కేబినెట్ ద్వారా అంతిమ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సంస్థలకు తమ అభిప్రాయాన్ని చెప్పి 10-15 రోజుల్లో సమగ్ర డీపీఆర్‌లతో రమ్మని కోరతామన్నారు. రుషికొండ వైజాగ్ వాసులకు ఎంతో అనుబంధం ఉన్న ప్రాంతం కాబట్టి, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినా ఒక బ్లాక్‌ను కల్చర్ లేదా హెరిటేజ్ సెంటర్‌గా మార్చి ప్రజల సందర్శనార్థం ఉంచాలని యోచిస్తున్నట్లు తెలిపారు.