NITI Aayog Gets New Team: దేశంలోని అత్యంత కీలక విధాన నిర్ణయ సంస్థ అయిన నీతి ఆయోగ్‌లో కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. సంస్థను మరింత సమర్థంగా నడిపే దిశగా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, అలాగే కేంద్ర ప్రభుత్వానికి గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన డాక్టర్ అశోక్ కుమార్ లాహిరిని వైస్ చైర్మన్ గా నియమించింది.
కొత్తగా పూర్తిస్థాయి సభ్యులు
ఇక కొత్తగా పూర్తిస్థాయి సభ్యులుగా పలువురు ప్రముఖులను ఎంపిక చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్, మాజీ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, శాస్త్రవేత్తలు కె.వి. రాజు, డాక్టర్ గోబర్ధన్ దాస్, అలాగే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అభయ్ కరందీకర్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వివిధ రంగాల్లో అనుభవం ఉన్న ఈ నిపుణుల చేరికతో నీతి ఆయోగ్ మరింత బలపడుతుందని భావిస్తున్నారు.
నియామకాలపై ప్రధాని మోడీ కీలక ప్రకటన
ఈ నియామకాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధికి వారు తమ అనుభవాన్ని ఉపయోగించి కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నియామకం అనంతరం అశోక్ కుమార్ లాహిరి ప్రధానమంత్రిని కలిశారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించినట్లు భావిస్తున్నారు. మొత్తం మీద, ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా నీతి ఆయోగ్ పనితీరులో వేగం పెరగడం, విధానాల రూపకల్పనలో మరింత సమన్వయం రావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.