Swati Maliwal Slams Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను 2006 నుంచి కేజ్రీవాల్‌తో కలిసి పనిచేస్తూ పలు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నానని తెలిపారు. అయినప్పటికీ తనకు తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. తన ఇంట్లోనే గుండాల చేత కేజ్రీవాల్ తనపై దాడి చేయించారని వెల్లడించారు. ఆ ఘటనపై ఫిర్యాదు చేసిన తర్వాత దానిని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చారని ఆమె ఆరోపించారు.
పార్టీలో ప్రధాన్యత ఇవ్వలేదు!
అంతేకాకుండా, పార్టీ తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని స్వాతి మాలివాల్ విమర్శించారు. ముఖ్యంగా పార్లమెంట్లో మాట్లాడే అవకాశాన్ని గత రెండేళ్లుగా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణాల వల్లే పార్టీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
బీజేపీలో చేరిన ఏడుగురు ఆప్ ఎంపీలు
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం పెద్ద చర్చకు దారితీసింది. స్వాతి మాలివాల్‌తో పాటు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, విక్రమ్ సింగ్ సాహ్నీ, రాజేందర్ గుప్తా కూడా బీజేపీలో చేరారు. ఇది ఆప్‌కు గట్టి దెబ్బగా భావిస్తున్నారు.
ప్రధాని మోదీపై స్వాతి మాలివాల్ విశ్వాసం
బీజేపీలో చేరిన తర్వాత స్వాతి మాలివాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశ భద్రత, నక్సలిజంపై తీసుకున్న చర్యలు, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం లాంటి అంశాలను ప్రస్తావిస్తూ మోదీని ప్రశంసించారు. అలాగే హోం మంత్రి అమిత్ షా పాత్రను కూడా ఆమె గుర్తు చేశారు. తాను స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఎవరి ఒత్తిడి లేకుండా బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. మొత్తంగా ఆప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వాతి మాలివాల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.