వరంగల్, క్రైమ్‌మిర్రర్:తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్ల పంపిణీని ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఈ పింఛన్లు ముఖ్యంగా తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితుల కోసం ప్రత్యేకంగా అందించబడనున్నాయి. ఈ విషయాన్ని పంచాయతీ రాజ్ శాఖపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ముఖ్యమంత్రి, బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు ఈ పింఛన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. అర్హులైన బాధితులను గుర్తించి, వెంటనే పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ కూడా పింఛన్లు మంజూరు చేయాలని సీఎం సూచించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు ఆలస్యం లేకుండా వెంటనే పింఛన్లు అందించాలనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
Also Read:జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. వలస కూలీలపై కాల్పులు, ఒకరి మృతి
మండల స్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ఎంపీడీవోలు బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మండల పరిషత్తు సమావేశాలను 45 రోజులకు ఒకసారి నిర్వహించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని తెలిపారు. ఈ సమావేశాలు గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు సహాయపడతాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ కార్యాలయాలు గ్రామ జనాభా ఆధారంగా వర్గీకరించి నిర్మించాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు. పారిశుద్ధ్య పనులు, ఇతర అంశాలకు సంబంధించి కార్యదర్శులు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని సీఎం తెలిపారు.
Also Read:అగ్గిపెట్టె ఇవ్వలేదని ఆగ్రహం.. మద్యం దుకాణానికి నిప్పు పెట్టిన వ్యక్తి
ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో తాగు నీటి సరఫరాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామీణ తాగు నీటి సరఫరా, హైదరాబాదు వాటర్ బోర్డ్, ఇరిగేషన్ అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించాలి. తాగు నీటికి ప్రాధమికత ఇవ్వాలని ఆయన తెలిపారు. గ్రామీణ తాగు నీటి పథకాల పరిధిలో పనిచేసే వారికి వేతనాలు కచ్చితంగా ఐదో తేదీలోపు అందించాలనే ఆదేశాలు ఇచ్చారు. కోటి మంది మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలు ఆకట్టుకునే డిజైన్‌లో ఉండాలని, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీపడొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిజైన్ల రూపకల్పనలో నిఫ్ట్ విద్యార్థులను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
