Homeతెలంగాణచండూర్ రాజకీయంలో ముడుపుల పోటు...!

చండూర్ రాజకీయంలో ముడుపుల పోటు…!

  • చండూర్ రాజకీయంలో ముడుపుల పోటు.

  • పార్టీ నిబద్ధతను మింగేసిన నోట్ల కట్టలు

  • సొంత గూటికే కన్నం వేసిన వెన్నుపోటు దారులు.!

​నల్గొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): చండూర్ మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఇప్పుడు నైతిక విలువల పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజా సేవ ముసుగులో కొందరు నేతలు సాగిస్తున్న, అంగడి రాజకీయం అధికార పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా, అంతర్గత కుమ్ములాటలకు దారితీసింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, పార్టీ క్రమశిక్షణ కోసం తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించి నామినేషన్ల ను విత్‌డ్రా చేయించారు. ఆ త్యాగం వెనుక కొందరు నేతలు లక్షలాది రూపాయలను, బేరసారాలు సాగించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

వసూళ్ల పర్వం.. అభ్యర్థులకు చుక్కలు..!

బిఫామ్ దక్కకపోయినా నామినేషన్లు వేసిన కొందరు నాయకులు, ఎమ్మెల్యే మాటకు గౌరవం ఇచ్చి తప్పుకుంటున్నట్లు బయటకు కలరింగ్ ఇచ్చారు.! కానీ, తెరవెనుక మాత్రం వార్డు అభ్యర్థుల నుంచి, లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.! ఇప్పటికే ఎన్నికల ఖర్చుతో సతమతమవుతున్న అభ్యర్థులను, మేము విత్‌డ్రా కావాలంటే ఇంత ఇచ్చుకోవాల్సిందే అంటూ బ్లాక్ మెయిల్ చేసి మరీ, భారీ మొత్తాలు కాజేసినట్లు సమాచారం. గెలుపు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులు అడిగినంత ఇచ్చుకున్నా, చివరకు ఫలితాల్లో వారికి వెన్నుపోటు తప్పలేదు.!?

ఇక్కడే అసలు ద్రోహం వెలుగుచూసింది. సొంత పార్టీ అభ్యర్థి నుంచి విత్‌డ్రా ఖర్చులు వసూలు చేసిన కొందరు నేతలు, అంతటితో ఆగకుండా ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా, భారీగా ముడుపులు అందుకున్నట్లు తెలుస్తోంది.! పార్టీ జెండాను భుజాన వేసుకునే తిరుగుతూనే, లోపాయికారిగా విపక్ష అభ్యర్థులకు ఓట్లు మళ్లించేలా డబుల్ గేమ్ ఆడటంతో, అధికార పార్టీ అభ్యర్థులు బలిపశువులయ్యారు. డబ్బు కోసం పార్టీ సిద్ధాంతాలను, నాయకత్వ నమ్మకాన్ని, తాకట్టు పెట్టిన ఈ నేతల తీరుపై కార్యకర్తలు మండిపడుతున్నారు.

కొన్ని వార్డుల్లో వచ్చిన అనూహ్య ఫలితాలు, క్షేత్రస్థాయిలో జరిగిన ఈ ఆర్థిక లావాదేవీల చిట్టా ఇప్పుడు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వద్దకు చేరినట్లు తెలుస్తోంది.? నమ్మించి గొంతు కోసిన నేతలెవరు? పార్టీ ప్రతిష్టను బజారున పడేసి, ముడుపులకు మరిగిన ద్రోహులెవరు? అనే కోణంలో ఆయన ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం.! రానున్న సమీక్షా సమావేశాల్లో ఈ వెన్నుపోటు రాజకీయాలపై, కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. డబ్బు ముందు పార్టీ కట్టుబాట్లు పనికిరావు అనుకునే నేతలకు, రాజకీయ సమాధి కట్టేలా ఎమ్మెల్యే యాక్షన్ ప్లాన్ ఉండబోతోందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు