జమ్మూ నగర శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి కాన్వాయ్‌లోని ఓ స్కార్పియో వాహనం ఢీకొనడంతో 55 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గంగ్యా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బీహార్‌కు చెందిన భరత్ కాపర్ (55) స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి సుమారు 9:05 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన స్కార్పియో అతడిని ఢీకొట్టినట్లు సమాచారం.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భరత్‌ను వాహనం నడుపుతున్న వ్యక్తి వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనం వేగం తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: పైలట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్.. చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేల్చిన కోర్టు
