-
వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో బరిలోకి
-
తేల్చి చెప్పిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
-
డి లిమిటేషన్ తో మారిన రాజకీయ వ్యూహం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ఇక రాజకీయాలు చాలు. ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తన రాజకీయ వారసుడిగా కుమారుడు అమిత్ పేరును ప్రకటించారు. వచ్చే ఏడాది ఎమ్మెల్సీ పదవి ముగియనుండడంతో.. ఇక ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటారని అంతా భావించారు. కానీ సుఖేందర్రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బరిలో దిగుతానని స్పష్టం చేశారు. నల్గొండలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన ఆలోచనను మార్చుకున్నాను అని.. డి లిమిటేషన్ తో నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున నియోజకవర్గాలు పెరగనున్న దృష్ట్యా మరోసారి పోటీ చేస్తానని వెల్లడించారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
కుమారుడు పేరు ప్రకటించి…
ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా ఉన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. తన బదులు రాజకీయ వారసుడిగా కుమారుడు పేరును ప్రకటించారు. కానీ డి లిమిటేషన్ తో పరిస్థితులు మారినట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తమ కుటుంబ ప్రాబల్యం పోతుందని సుఖేందర్ రెడ్డి బాధతో ఉన్నారట. అందుకే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తాను ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు దూరంగా ఉండలేనని.. ఎన్నికల బరిలో దిగి ప్రజాసేవ కొనసాగిస్తానని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆర్థికంగా బలమైన కుటుంబాల వారు రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉందని.. వారికి సరైన మార్గంలో నడిపించేందుకు తనలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సుఖేందర్ రెడ్డి. ఈ విషయంలో తనకు పివి నరసింహారావు, నీలం సంజీవరెడ్డి ఆదర్శప్రాయులుగా చెప్పుకొచ్చారు.
యూటర్న్ వెనుక వ్యూహం…
పక్కా వ్యూహంతోనే గుత్తా సుఖేందర్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. డీ లిమిటేషన్ తో మరో ఆరు నియోజకవర్గాలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు పార్లమెంటు స్థానాలకు తోడు మరో సీటు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో తన కుటుంబం రెండు చోట్ల పోటీ చేసేందుకు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ కోటాలో తను.. జూనియర్ కోటాలో తన కుమారుడు బరిలో దిగేందుకు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన మరుక్షణం నియోజకవర్గాల ఎంపిక చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించినట్టే ప్రకటించి మళ్లీ యూటర్న్ తీసుకున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
సుదీర్ఘ నేపథ్యం…
తెలంగాణలో సీనియర్ మోస్ట్ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి. 1981లో గ్రామపంచాయతీ వార్డు మెంబర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1991లో నల్గొండ జిల్లా చిట్యాల్ సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1995లో దేవరకొండ జడ్పిటిసి అయ్యారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పాడి అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. 1999లో నల్గొండ ఎంపీగా విజయం సాధించారు. 2009లో సైతం అదే నల్గొండ నుంచి ఎంపీ అయ్యారు. 2014 నుంచి 2019 మధ్య 16వ లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి 2019లో ఎమ్మెల్సీ అయ్యారు. 2021లో శాసనమండలి చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన తాను ఇకనుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. తన రాజకీయ వారసుడిగా కుమారుడు పేరును తెరపైకి తెచ్చారు. కానీ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనతో తన కుటుంబ ప్రాతినిధ్యం పెంచుకోవాలని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు గుత్తా సుఖేందర్ రెడ్డి.