Homeజాతీయంపెంపుడు జంతువులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. గడువు దాటితే రూ.5,000 జరిమానా!

పెంపుడు జంతువులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. గడువు దాటితే రూ.5,000 జరిమానా!

జైపూర్ నగరంలో పెంపుడు జంతువుల యజమానులకు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. నగర మున్సిపల్ సంస్థ కొత్తగా ప్రకటించిన నిబంధనల ప్రకారం, ప్రతి పెంపుడు కుక్క, పిల్లికి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు నిర్ణయించారు.

ఈ గడువులోగా నమోదు చేయించుకోని యజమానులపై రూ.5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ప్రారంభంలో రెండు నెలల గడువు ఇచ్చినట్లు తెలిపారు.

ఈ నిర్ణయంపై మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ.. నగరాన్ని రేబిస్ వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. పెంపుడు జంతువుల వ్యాక్సినేషన్, ఆరోగ్య వివరాలను నమోదు చేయడం ద్వారా పబ్లిక్ హెల్త్‌ను మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. అలాగే యజమానుల్లో బాధ్యతా భావం పెంపొందుతుందని తెలిపారు.

ఇక యజమానులను ప్రోత్సహించేందుకు ఆగస్టు 2న ప్రత్యేక ‘పెట్ కార్నివాల్’ నిర్వహించనున్నారు. ఇందులో జంతువులకు ఉచిత రేబిస్ టీకాలు, ఆరోగ్య పరీక్షలు, వెంటనే రిజిస్ట్రేషన్ సౌకర్యం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. అదనంగా జంతువుల దత్తత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

కొత్త నిబంధనల ప్రకారం, మూడు నెలల వయసులోనే పెంపుడు జంతువులకు తొలి రేబిస్ టీకా వేయించాలి. అనంతరం ప్రతి సంవత్సరం టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ఈ వివరాలన్నీ రిజిస్ట్రేషన్ రికార్డుల్లో నమోదు చేస్తారు.

పెట్ షాపులు, బ్రీడర్లు, కెన్నెల్ నిర్వాహకులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. వారు సంబంధిత సంస్థల వద్ద నమోదు చేసుకోవడంతో పాటు, జంతువులను విక్రయించే ముందు అధికారిక రిజిస్ట్రేషన్ చేయించాలి. మూడు నెలల లోపు వయసున్న జంతువులను విక్రయించే సమయంలో కొనుగోలుదారుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000 (జీఎస్టీ అదనం), వార్షిక రీన్యువల్ రూ.500 (జీఎస్టీ అదనం)గా నిర్ణయించారు. ఇతర నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.2,000 వరకు జరిమానా విధించనున్నారు. అధికారులు పట్టుకున్న జంతువుల సంరక్షణకు రోజుకు రూ.100 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారు.

ఈ చర్యలతో నగరంలో జంతు సంక్షేమం మెరుగుపడటంతో పాటు, వ్యాధుల నియంత్రణకు దోహదం చేస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.

also read: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి మోదీకి ఆహ్వానం – సీఎం చంద్రబాబు ఢిల్లీ భేటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు