కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లి ప్రాంతంలో ఓ 14 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. మోసం చేసి బయటకు తీసుకెళ్లి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, జూలై 17న ఓ మహిళ బాలికను దేవాలయానికి తీసుకెళ్తానని నమ్మించి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లింది. అనంతరం ఆమెను ఇద్దరు వ్యక్తులకు అప్పగించింది. వారు బాలికను మరో ప్రాంతానికి తీసుకెళ్తూ మార్గమధ్యంలో బలవంతంగా మద్యం తాగించారు.
మద్యం మత్తులో ఉన్న బాలికను ఇంటి వద్ద దించేందుకు ప్రయత్నించినప్పటికీ, తల్లిదండ్రులు మందలిస్తారనే కారణంతో లోపలికి వెళ్లనివ్వలేదు. ఆ తరువాత నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ నిర్మాణంలోకి తీసుకెళ్లి రాత్రంతా ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా శారీరకంగా హింసించారు.
మరుసటి రోజు ఉదయం బాలికను ఇంటి వద్ద వదిలిపెడుతూ ఈ విషయం ఎవరితోనైనా చెబితే ప్రాణహాని కలిగిస్తామని బెదిరించారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, ఉదయం తిరిగి వచ్చిన బాలికను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read: పెంపుడు జంతువులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. గడువు దాటితే రూ.5,000 జరిమానా!