అనంతపురం, క్రైమ్ మిర్రర్: మంత్రాలయం నియోజకవర్గంలో భూకబ్జాల పర్వం జోరుగా కొనసాగుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ‘జగనన్న కాలనీల’ పేరుతో ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పట్టాల పంపిణీ ప్రక్రియలో నిజమైన నిరుపేదలకు ఇళ్ల కేటాయింపు సరిగ్గా జరగలేదనే విమర్శలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, గత ప్రభుత్వంలో పట్టాలు పొందిన లబ్ధిదారులలో చాలామంది ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. మరికొందరు బేస్‌మట్టం (పునాది) స్థాయిలోనే నిర్మాణాలను నిలిపివేయగా, ఇంకొందరు ఇప్పటివరకు అసలు ఎలాంటి పనులూ ప్రారంభించకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా, జగనన్న కాలనీల్లో నివసించే ప్రజల సామాజిక అవసరాల కోసం, ప్రభుత్వ కార్యాలయాలు మరియు మౌలిక
వసతుల కల్పన నిమిత్తం ప్రభుత్వం కొంత స్థలాన్ని ‘బహిరంగ ప్రదేశం’ (ఓపెన్ ప్లేస్)గా కేటాయించింది. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాలపైనే కబ్జాదారుల కన్ను పడింది. రాత్రికి రాత్రి నకిలీ పట్టాలు సృష్టించడం, తెల్లారేసరికి సరిహద్దు రాళ్లు పాతి భూమిని ఆక్రమించుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది.మొన్నటికి మొన్న కొంతమంది స్థానిక నాయకులు రంగంలోకి దిగి, “గత ప్రభుత్వంలోనే మాకు ఇక్కడ పట్టాలు ఇచ్చారు” అంటూ, అంతకుముందే అక్కడ రాళ్లు పాతకున్న కొందరు పేదల రాళ్లను పీకేసి, తమ మార్కింగ్ వేసుకుని వెళ్లారు.
దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే, రెవెన్యూ అధికారులు మాత్రం “ఆ స్థలం ఓపెన్ ప్లేస్ అని, తాము ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని” స్పష్టం చేశారు.ఈ వివాదం ఇలా ఉండగానే, తాజాగా మరో వర్గం వారు వచ్చి అక్కడ కొత్తగా రాళ్లు పాతి, వాటికి నంబర్లు వేశారు. “గత వైసీపీ ప్రభుత్వం రాకముందే ఇక్కడ ప్రభుత్వ పోరంబోకు భూమి ఉందని, దానిని తమకు కేటాయించారని” చెబుతూ కొన్ని పట్టాలను చూపించడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.అసలు ఎప్పుడు కొత్త పట్టాలు పుట్టుకొస్తున్నాయో, తకుముందు పాతిన రాళ్లను ఎవరు పీకేస్తున్నారో, ఆ పట్టాలను ఎవరు సృష్టిస్తున్నారో అర్థం కాక మంత్రాలయం గ్రామ ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.
ఈ భూదందా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనేది మిస్టరీగా మారింది.ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, త్రాలయంలో సాగుతున్న ఈ నకిలీ పట్టాల గుట్టు రట్టు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కబ్జాల పర్వానికి అడ్డుకట్ట వేసి, వివాదాస్పద స్థలాలను కాపాడటంతో పాటు, నిజమైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు దక్కేలా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.