Homeతెలంగాణసీఎం రేవంత్‌కు కేటీఆర్‌ స్రాంగ్‌ కౌంటర్‌.. చాలెంజ్‌ స్వీకరించాలని సవాల్‌.!

సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ స్రాంగ్‌ కౌంటర్‌.. చాలెంజ్‌ స్వీకరించాలని సవాల్‌.!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రైతుల పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారని, ఉచిత విద్యుత్‌ నిలిపేస్తే రాజకీయాలు నుంచి తప్పుకుంటామని, బీఆర్‌ఎస్‌ నేతలు దీనికి సిద్ధమా.? అంటూ తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన సవాల్‌పై కేటీఆర్‌ స్పందించారు. సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. రైతుల బోర్లకు విద్యుత్‌ మీటర్లు బిగించడం కాదని, ఎన్నికల హామీలు నెరవేర్చాకే ఎన్నికల్లో పోటీ చేస్తానని చాలెంజ్‌ చేయాలంటూ రేవంత్‌కు కేటీఆర్‌ సూచించారు. రేవంత్‌ రెడ్డికి నిజంగా దమ్ముంటే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను, ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలుచేసిన తరువాతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలను ఆయన గుప్పించారు. రైతుల మోటార్లకు మీటర్లుపెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమంటూ రేవంత్‌ రెడ్డి చెబుతున్న మాటలు ముమ్మాటికీ అబద్దాలన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు మూడు గంటల కరెంట్‌ సరిపోతుందని రేంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. రైతు డిస్కం పేరుతో కొత్త కుట్రకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెర లేపిందని ఆరోపించారు. రైతు డిస్కం అన్నది రైతన్నల మెడకు ఉరితాడు లాంటిదన్నారు. దీని ద్వారా ఉచిత విద్యుత్‌ను శాశ్వతంగా రద్దు చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యమని కేటీఆర్‌ ఆరోపించారు.

హైదరాబాద్‌ అభివృద్ధి ఎక్కడని ప్రశ్న..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల దాటుతున్నా హైదరాబాద్‌ నగరంలో అభివృద్ధి ఎక్కడా చేయలేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. హైడ్రా పేరుతో హడావిడి చేస్తున్నారని విమర్శించిన కేటీఆర్‌.. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల సమయంలో మంత్రి పొంగులేటి వంటి వారు వచ్చి ఆరు వేల ఇళ్లను ఇస్తామని ఇచ్చినహామీ ఏమైందని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నగరంలో ప్లై ఓవర్లు నిర్మించామని, అండర్‌ పాస్‌లు కట్టామని, లక్ష డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు అందించడంతోపాటు జీవో 58, 59 ద్వారా పేదలకు భూమి హక్కు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా అనే భూతాన్ని తెచ్చి పేద ప్రజల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూలగొడుతోందని, వారికి తీరని అన్యాయాన్ని చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌ డిఫెన్స్‌ భూముల బదలాయింపు కోసం, కరీంనగర్‌, నిజామాబాద్‌ వైపు స్కైవేల నిర్మాణానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి వల్లే ఆ పనులు సాకారమయ్యాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు