Homeతెలంగాణకమీషన్ల కోసం సొంత ప్రాంతాన్ని ఎండబెట్టిన ఘనత కొప్పుల ఈశ్వర్‌దే...

కమీషన్ల కోసం సొంత ప్రాంతాన్ని ఎండబెట్టిన ఘనత కొప్పుల ఈశ్వర్‌దే…

  • మంత్రి లక్ష్మణ్ కుమార్‌పై విమర్శలు మానుకోవాలి

  • గొల్లపల్లి మండల కాంగ్రెస్ నేతల ఫైర్

జగిత్యాల జిల్లా బ్యూరో,క్రైమ్ మిర్రర్: ​ రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ చేసిన విమర్శలను గొల్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పదేళ్లు అధికారంలో ఉండి సొంత ప్రాంతానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని కొప్పుల ఈశ్వర్‌కు, నిరంతరం అభివృద్ధి కోసం శ్రమిస్తున్న మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని వారు మండిపడ్డారు. సోమవారం గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
.

కమీషన్ల కోసం నీటి తరలింపు…

కమీషన్లకు కక్కుర్తిపడి కొప్పుల ఈశ్వర్ సొంత ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా సిద్దిపేట, హైదరాబాద్‌లకు నీటిని తరలించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గోదావరి నది పక్కనే ఉన్నా, ఎస్సారెస్పీ, జంగాలపల్లి ప్రాజెక్టుల్లో నీళ్లున్నా.. గొల్లపల్లి మండలంలోని గోవిందపల్లె, చిల్వకోడూరు, లొత్తునూర్, బొంకూర్, అబ్బపూర్ వంటి గ్రామాలకు చుక్క నీరు రావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

​అప్పుల కుప్పగా తెలంగాణ: సోనియా గాంధీ మిగులు రాష్ట్రాన్ని ఇస్తే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అప్పుల్లో ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వంటి హామీలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్ అభివృద్ధి పనులు…

లక్ష్మణ్ కుమార్ గతంలో జెడ్పీ చైర్మన్‌గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, విప్‌గా, ఇప్పుడు మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు. ఆయన కృషితోనే ధర్మపురిలో నైట్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్, గొల్లపల్లిలో రూ. 18 కోట్లతో గురుకుల పాఠశాల మంజూరయ్యాయని వివరించారు.

అభివృద్ధి చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ​బీఆర్ఎస్ తీరుపై ధ్వజం: గతంలో కాంగ్రెస్ నాయకులను మాట్లాడనివ్వకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని, ఇటీవలి సమావేశాల్లోనూ “బీఆర్ఎస్ గుండాలు” వివాదాలు సృష్టించి ప్రజలను రెండు వర్గాలుగా విడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 200 కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించలేని కేసీఆర్, ఆశీర్వాద సభలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

​ఈ సంద‌ర్భంగా 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కొప్పుల ఈశ్వర్ తన స్థాయిని మరిచి, కేవలం కొద్దికాలం మాత్రమే పదవుల్లో ఉన్న మంత్రి లక్ష్మణ్ కుమార్‌పై చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా పద్ధతిగా, హుందాగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వారు స్పష్టం చేశారు.

​ఈ సమావేశంలో మండల అధ్యక్షులు నిశాంత్ రెడ్డి. మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు