క్రైమ్ మిర్రర్, సినిమా:- కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీనిధి శెట్టి, తనపై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ప్రచారానికి తొలిసారి స్పందించారు. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ లో సీత పాత్రను తాను తిరస్కరించాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. అసలు ఆ పాత్రను రిజెక్ట్ చేయలేదని, దానికి ఆడిషన్ ఇచ్చినా ఎంపిక కాలేదని వెల్లడించారు.ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీనిధి మాట్లాడుతూ, నేను రామాయణలో సీత పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చాను. అయితే చివరికి ఆ పాత్రకు ఎంపిక కాలేదు. కానీ నేను స్వయంగా ఆ అవకాశాన్ని తిరస్కరించానని ప్రచారం జరిగింది. అలాంటి వార్తలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదు. సీత పాత్ర నా కలల పాత్రల్లో ఒకటి. అలాంటి అవకాశాన్ని నేను ఎందుకు వదులుకుంటాను? అని ప్రశ్నించారు. వాస్తవాలను తెలుసుకోకుండా పుకార్లు వేగంగా వ్యాపించడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
ప్రముఖ మద్యం బ్రాండ్లపై బ్యాన్!
భారతీయ సినీ చరిత్రలో సీత పాత్రకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని శ్రీనిధి అన్నారు. ఆ పాత్రలో నటించే అవకాశం రావడం ఏ నటికైనా గౌరవంగా భావిస్తారని, అలాంటి అవకాశాన్ని తిరస్కరించడం గురించి తాను అసలు ఆలోచించలేదని చెప్పారు. కనీసం ఆ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చే అవకాశం రావడమే తనకు గర్వకారణమని వెల్లడించారు. ఆమె వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు కూడా స్పందిస్తూ, అధికారిక సమాచారం కాకుండా వచ్చే పుకార్లను నమ్మొద్దని సూచిస్తున్నారు.ఇదిలా ఉంటే, నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. యశ్ రావణుడి పాత్రలో కనిపించనుండగా, లారా దత్తా, షీబా చద్దా, రవి దూబే, అరుణ్ గోవిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా విడుదలయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
2018లో కేజీఎఫ్: చాప్టర్ 1 తో సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీనిధి శెట్టి, తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత పలు భాషల్లో అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. తాజాగా సీత పాత్రపై వచ్చిన పుకార్లకు ఆమె ఇచ్చిన వివరణతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టైంది.
