క్రైమ్ మిర్రర్ : లైంగిక వేధింపులు, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే జైలుకు వెళ్లారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. నిందితుడి వ్యక్తిగత ప్రవర్తన, బాధితురాలితో పరిచయం ఏర్పడిన తీరు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను పోలీసులు తమ నివేదికలో వివరించినట్లు తెలుస్తోంది. పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో ఇద్దరు యువతులకు వివాహ ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. వారిలో ఒకరు ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. అనంతరం బాధితురాలితో పరిచయం ఏర్పడి, అది క్రమంగా సన్నిహిత సంబంధంగా మారిందని పోలీసులు వెల్లడించినట్లు సమాచారం.
ఉదయ్ కృష్ణారెడ్డి వ్యక్తిగత పరిస్థితులు, నేపథ్యం గురించి తెలుసుకున్న బాధితురాలు అతడిపై సానుభూతితో వ్యవహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు కూడా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై ఐపీఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో, ఐఏఎస్‌కు సిద్ధమవుతున్న విషయాలను అతడితో పంచుకున్నట్లు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత అతడి విజయ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితురాలు అతడిని సంప్రదించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే కొంతకాలం తర్వాత అతడి ప్రవర్తనలో మార్పులు రావడంతో బాధితురాలు దూరంగా ఉండేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.
బాధితురాలి వ్యక్తిగత వీడియోలను ఆమె అనుమతి లేకుండా భర్తకు పంపించినట్లు పోలీసులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన సమయంలో బాధితురాలిపై దాడి జరిగినట్లు పేర్కొంటూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. అక్కడ స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది. వాటిలోని డేటా ఆధారంగా దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.
అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న ‘అభ్యాస ఐఏఎస్ అకాడమీ’కు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయాలు, సంబంధాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బాధితురాలికి ముందు ఉదయ్ వివాహ ప్రతిపాదన చేసినట్లు చెబుతున్న మరో ఇద్దరు యువతులను కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఆధారాల పరిశీలన, సంబంధిత వ్యక్తుల విచారణ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : బలూచిస్తాన్‌లో బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది మృతి
