క్రైమ్ మిర్రర్ : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా సమీపంలోని సోరేంజ్ ప్రాంతంలో ఉన్న ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించడంతో 32 మంది కార్మికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అధికారుల వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో గనిలో మొత్తం 36 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో గని లోపలి భాగం దెబ్బతినగా, పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 29 మంది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరో ముగ్గురి మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గనిలో మీథేన్ వాయువు అధికంగా పేరుకుపోవడం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని మరో గని కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు, గనుల శాఖ అధికారులు, స్థానిక సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న కార్మికుల కోసం గాలింపు చేపట్టారు. అయితే ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా శిథిలాల కింద ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసే అవకాశాలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు.
బలూచిస్తాన్ ప్రాంతంలోని బొగ్గు గనుల్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అనేక గనుల్లో సరైన వెంటిలేషన్ సదుపాయాలు, గ్యాస్ గుర్తింపు పరికరాలు, భద్రతా ప్రమాణాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని కార్మిక సంఘాలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గనుల యాజమాన్యాలు భద్రతా నిబంధనల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, తీవ్ర పేదరికం, ఉపాధి అవకాశాల కొరత కారణంగా బలూచిస్తాన్‌లో వేలాది మంది కుటుంబాలు బొగ్గు గనులపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ తాజా ప్రమాదం మరోసారి గని కార్మికుల భద్రత, అక్కడి పని పరిస్థితులపై ప్రశ్నలను లేవనెత్తింది. ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
also read : రోకలిబండతో మోది తల్లిని హత్య చేసిన కొడుకు– ఉత్తరప్రదేశ్‌లో సంచలనం
