క్రైం మిర్రర్ : ముస్సోరీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విశాఖకు చెందిన టెక్కీ రాధాగాయత్రి కేసు మరో మలుపు తిరిగింది. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యుల పోరాటం నేపథ్యంలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ క్రమంలో రాధాగాయత్రి భర్త శ్రీచరణ్‌ను డెహ్రాడూన్ పోలీసులు అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. రాధాగాయత్రి మృతిపై ఆమె తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, తమ కుమార్తెకు న్యాయం చేయాలని డెహ్రాడూన్‌లో అధికారులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం ఘటనపై మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించింది.
డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ముస్సోరీ డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ విచారణ ప్రారంభించారు. ఘటనకు ముందు జరిగిన పరిణామాలు, రాధాగాయత్రి-శ్రీచరణ్ మధ్య ఉన్న పరిస్థితులు, ఇతర కీలక అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. జూన్ 14 నుంచి 16వ తేదీ మధ్య జరిగిన పరిణామాలపై స్పష్టత కోసం శ్రీచరణ్‌తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే శ్రీచరణ్ ఆచూకీ లభించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా ఘటనకు ముందు శ్రీచరణ్ ఎక్కడ ఉన్నాడు? ఎవరితో సంప్రదింపులు జరిపాడు? ఆ సమయంలో ఏం జరిగింది? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే రాధాగాయత్రి పోస్టుమార్టం ప్రక్రియకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.రాధాగాయత్రి కుటుంబ సభ్యుల అనుమతులు, పోస్టుమార్టం నిర్వహించిన విధానం వంటి అంశాలపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్య సిబ్బంది నుంచి వివరాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తుతో పాటు మెజిస్ట్రియల్ విచారణ కొనసాగుతోంది. రాధాగాయత్రి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.