-
ఒకటో తేదీనే జీతాలు తప్పనిసరి.. ఆలస్యమైతే చర్యలు
-
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందేలా కఠిన మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం సహించబోమని స్పష్టం చేస్తూ సంబంధిత అధికారులపై బాధ్యతను నేరుగా మోపింది.
రాష్ట్రంలోని రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గౌరవ వేతన సిబ్బంది సహా అందరికీ ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జీతాల చెల్లింపులో జాప్యం జరిగితే ఆయా శాఖల ఉన్నతాధికారులు, జీతాల పంపిణీకి బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Also Read: జూన్ 11న ఖర్గే సారథ్యంలో ఏఐసీసీ అత్యవసర సమావేశం..
ఇప్పటివరకు కొన్ని శాఖల్లో వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతున్నట్లు ప్రభుత్వం గమనించింది. ముఖ్యంగా బిల్లుల తయారీలో జాప్యం, ట్రెజరీలకు సకాలంలో సమర్పించకపోవడం, ఉద్యోగుల హాజరు వివరాల్లో గందరగోళం, ఆడిటింగ్ ప్రక్రియల్లో ఆలస్యం వంటి కారణాలతో జీతాలు సమయానికి అందడం లేదని గుర్తించింది.
ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో లోపాలు బయటపడటంతో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఇకపై ఎలాంటి కారణం చెప్పినా జీతాల చెల్లింపులో ఆలస్యం ఉండకూడదని స్పష్టం చేసింది. అవసరమైతే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు నేరుగా ఆర్థిక శాఖను సంప్రదించి సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించింది.
Also Read: Donald Trump: ఇక చాలంటూ మైక్ విసిరేసిన ట్రంప్..!
అలాగే అన్ని ప్రభుత్వ శాఖలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు కూడా ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు అందేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు సమయానికి జీతాలు అందే అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఆలస్యాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన అమలు జరిగేలా చర్యలు చేపట్టింది.