HomeజాతీయంJio Satellite Internet: ఇక నేరుగా నింగి నుంచే ఇంటర్నెట్.. టెలికం రంగంలో జియో సంచలనం!

Jio Satellite Internet: ఇక నేరుగా నింగి నుంచే ఇంటర్నెట్.. టెలికం రంగంలో జియో సంచలనం!

దేశ టెలికం రంగంలో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ జియో ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల రంగంలోకి అడుగుపెట్టేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భూమి చుట్టూ తక్కువ ఎత్తులో తిరిగే సుమారు 1,650 ఉపగ్రహాల సహాయంతో దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్, టెలికం సేవలను అందించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 15 బిలియన్ డాలర్లు అంటే.. సుమారు రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం.

కేంద్రం నుంచి సానుకూల స్పందన

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు అమలులోకి వస్తే భారత్ లో  విదేశీ శాటిలైట్ నెట్‌ వర్క్‌ లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని, డిజిటల్ విప్లవం ఏర్పడుతుంది.  శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో భూమికి సుమారు 400 నుంచి 650 కిలోమీటర్ల ఎత్తులో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలను ఉపయోగిస్తారు. వీటి ద్వారా నేరుగా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించవచ్చు. ఈ సాంకేతికతతో నగరాలే కాకుండా కొండ ప్రాంతాలు, అడవులు, మారుమూల గ్రామాలు లాంటి సాధారణ టెలికం సేవలు చేరని ప్రాంతాలకూ కనెక్టివిటీ అందించే అవకాశం ఉంటుంది.

ముందంజలో స్టార్ లింక్

ప్రస్తుతం ఈ రంగంలో ఎలాన్ మస్క్‌ కు చెందిన స్టార్‌లింక్ ప్రపంచవ్యాప్తంగా ముందంజలో ఉంది. అలాగే అమెజాన్‌కు చెందిన ప్రాజెక్ట్ కైపర్, భారతీ గ్రూప్ భాగస్వామ్యంలోని యూటెల్‌ సాట్ వన్‌ వెబ్ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను విస్తరిస్తున్నాయి. అయితే, జియో ప్రత్యేకత ఏమిటంటే, శాటిలైట్ సేవలను తన ప్రస్తుత మొబైల్, బ్రాడ్‌ బ్యాండ్ నెట్‌ వర్క్‌ తో అనుసంధానించి సమగ్ర కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇది భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, అనుమతుల కేంద్రం (IN-SPACe) పరిశీలనలో ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ITU) నుంచి అవసరమైన స్పెక్ట్రమ్, ఉపగ్రహ కక్ష్యల అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది. అన్ని అనుమతులు లభిస్తే వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశముంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు