ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్‌కు వెళ్లిన తెలుగు విద్యార్థి మణిదీప్ రెడ్డి అదృశ్యమై రెండు నెలలు గడవకముందే మృతి చెందినట్లు సమాచారం రావడం కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటనపై మణిదీప్ కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం సమీపంలోని శేరిగూడ గ్రామానికి చెందిన మణిదీప్ రెడ్డి (18) గత సంవత్సరం ఆగస్టు 21న ఫిన్లాండ్‌కు వెళ్లి అక్కడి లాపీన్రాంటా ప్రాంతంలోని ఎల్‌యూటీ యూనివర్సిటీలో చేరాడు. చదువులు కొనసాగిస్తున్న సమయంలో ఈ ఏడాది మే 4న కుటుంబ సభ్యులతో చివరిసారి ఫోన్‌లో మాట్లాడిన అతను, ఆ తర్వాత కనిపించకుండా పోయాడు.
మే 9న అతని స్నేహితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, భారత రాయబార కార్యాలయానికీ సమాచారం అందించారు. అప్పటి నుంచి ఫిన్లాండ్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా మణిదీప్ జాడ లభించలేదు.
తాజాగా జూలై 9న సముద్ర తీరంలో ఒక యువకుడి మృతదేహం లభించిందని, అది మణిదీప్‌దేనని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని మణిదీప్ తల్లిదండ్రులు తిరస్కరిస్తున్నారు. అదృశ్యమైన వ్యక్తి 65 రోజుల తర్వాత సముద్రంలో లభించడం అనుమానాస్పదమని వారు అంటున్నారు.
ఈ కేసు దర్యాప్తులో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, నిజానిజాలు బయటపెట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై న్యాయపరమైన చర్యలు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. మణిదీప్ మృతి విషయంపై స్పష్టత రాకపోవడంతో కుటుంబం ఆవేదనతో పాటు అనుమానాల్లో కూరుకుపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
also read: వైజాగ్ లో భూకంపం.. ప్రజల్లో ఆందోళన