క్రైం మిర్రర్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని మామిండ్లవాడలో ఓ మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి ఆవరణలోని బావిలో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై ఉన్న గాయాలు, మెడకు బిగించిన గుడ్డను గుర్తించిన పోలీసులు హత్య జరిగి ఉండొచ్చనే అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మామిండ్లవాడకు చెందిన ఓ మహిళ శనివారం ఉదయం ఇంటి బావిలో నీళ్లు తీసేందుకు వెళ్లగా, అందులో మృతదేహం కనిపించింది. దీంతో ఆమె భయాందోళనకు గురై స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చింది. అనంతరం పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
మృతురాలిని అదే ప్రాంతానికి చెందిన చింత సునీతగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు ముఖం, పెదాల వద్ద గాయాలు ఉండటంతో పాటు మెడకు గుడ్డ బిగించి ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఆమె మృతి వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సునీతకు గతంలో వివాహం కాగా, భర్త మరణించిన తర్వాత ఇద్దరు కుమార్తెలతో జీవిస్తోంది. గత ఐదేళ్లుగా మోతే కిరణ్ అనే వ్యక్తితో కలిసి నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న హుజూరాబాద్ ఏసీపీ మాధవి సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి గల అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటనలో ఎవరైనా ప్రమేయం ఉందా? అనే అంశంపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.