-
22జిల్లాలో ఇందిరా మహాళ శక్తి భవనాలు పూర్తి
-
ఒక్కో భవానికి రూ.5కోట్లు
వరంగల్ , క్రైమ్‌మిర్రర్ః తెలంగాణ ప్రభుత్వం 22 జిల్లాల్లో రూ.110 కోట్లతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాలను జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించనుంది. మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణ, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం వీటిని శాశ్వత వేదికలుగా తీర్చిదిద్దారు. ఒక్కో భవనాన్ని 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.5 కోట్లతో నిర్మించారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సమాఖ్యలకు గొప్ప ఊరటనివ్వడమే కాకుండా ఆర్థిక పురోగతికి మార్గం సుగమం చేయనుంది.తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అడుగు వేసింది.
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి పేరుతో నిర్మిస్తున్న అత్యాధునిక భవనాలు ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నాయి. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా వీటిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ఈ భవనాలు ఇకపై కేంద్ర బిందువులుగా మారనున్నఉమ్మడి పది జిల్లాల్లో ఇప్పటికే భవనాలు ఉండగా.. కొత్తగా ఏర్పడిన 22 జిల్లాల్లో ఒక్కో భవనానికి రూ.5 కోట్ల చొప్పున ప్రభుత్వం మొత్తం రూ.110 కోట్లను కేటాయించింది. సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఈ భవనాలను నిర్మిస్తున్నారు.
హనుమకొండ, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, సూర్యాపేట, యాదాద్రి వంటి జిల్లాల్లో ఇప్పటికే 17 భవనాల నిర్మాణం పూర్తి కాగా.. మిగిలిన 5 జిల్లాల్లో పనులు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ పర్యవేక్షణలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది.ఇప్పటివరకు మహిళా సమాఖ్యలకు సొంత కార్యాలయాలు లేకపోవడంతో సమావేశాలు నిర్వహించాలన్నా, శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలన్నా అద్దె భవనాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈ భవనాల్లో కేవలం కార్యాలయ పనులే కాకుండా, మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, మార్కెటింగ్ కార్యకలాపాలు కూడా సాగనున్నాయి.
జిల్లా స్థాయి సమావేశాలు, సెమినార్ల నిర్వహణకు ఇవి వేదికలుగా నిలవనున్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.వచ్చే నెల 2వ తేదీ నాటికి ఏవైనా పెండింగ్ పనులు ఉంటే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మహిళా సాధికారతకు ఈ భవనాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ 2న జరిగే సామూహిక ప్రారంభోత్సవ కార్యక్రమం మహిళా లోకానికి ఒక తీపి గుర్తుగా మిగిలిపోనుందని ప్రభుత్వం చెబుతోంది.