ఆడపిల్ల పుట్టిందంటే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిరాశ వ్యక్తం చేసే పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లా పిపలాంత్రి గ్రామం మాత్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టుకను భారంగా భావించిన సమాజంలోనే ఇప్పుడు ప్రతి ఆడబిడ్డ జననాన్ని పండుగలా జరుపుకుంటున్నారు. అంతేకాదు.. గ్రామంలో ఆడపిల్ల పుడితే ఆమె గౌరవార్థం ఏకంగా 111 మొక్కలు నాటడం అక్కడ ప్రత్యేక సంప్రదాయంగా మారింది. పర్యావరణ పరిరక్షణతో పాటు బాలికల భవిష్యత్తును కాపాడే ఈ వినూత్న ఆచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
ఈ గొప్ప మార్పుకు కారణం పిపలాంత్రి గ్రామ మాజీ సర్పంచ్ శ్యామ్ సుందర్ పలివాల్. తన కుమార్తె కిరణ్ అకాల మరణం తర్వాత ఆమె జ్ఞాపకార్థం గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటడం ప్రారంభించారు. ఆ చిన్న ప్రయత్నమే క్రమంగా పెద్ద సామాజిక ఉద్యమంగా మారింది. ఆడపిల్ల పుట్టిందంటే బాధపడే పరిస్థితిని మార్చాలని సంకల్పించిన ఆయన, ప్రతి బాలిక పుట్టిన సందర్భంగా మొక్కలు నాటే సంప్రదాయాన్ని ప్రారంభించారు. నేడు అదే పిపలాంత్రి గ్రామాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది.
ఈ గ్రామంలో ఆడపిల్ల పుట్టినప్పుడు కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు.. ఆమె భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కూడా కల్పిస్తున్నారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు కలిసి రూ.31,000 సేకరించి ఆ బాలిక పేరుతో బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బును పాపకు 20 ఏళ్లు పూర్తయ్యే వరకు తీసుకోకుండా నిబంధన అమలు చేస్తున్నారు. అలాగే ఆడపిల్లకు సరైన విద్య అందిస్తామని, చట్టబద్ధమైన వయస్సు రాకముందే వివాహం చేయబోమని తల్లిదండ్రుల నుంచి అఫిడవిట్ కూడా తీసుకుంటున్నారు. ఈ చర్యల వల్ల గ్రామంలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గిపోయాయి. మహిళా అక్షరాస్యత కూడా పెరిగింది. గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ఈ నియమాలను అమలు చేయడం వల్ల పిపలాంత్రి ఇప్పుడు దేశంలోనే ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందింది.
ప్రకృతి సంరక్షణలో కూడా ఈ గ్రామం ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇప్పటి వరకు గ్రామంలో 3.5 లక్షలకు పైగా మొక్కలు నాటగా, అవి ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లుగా మారాయి. చెట్లను పురుగుల నుంచి రక్షించేందుకు వాటి చుట్టూ పెద్ద ఎత్తున కలబంద మొక్కలను పెంచుతున్నారు. ఇది గ్రామ ప్రజలకు ఆర్థికంగా కూడా మేలు చేస్తోంది. స్థానిక మహిళలు కలబందతో జ్యూస్‌లు, జెల్‌లు, ఇతర ఉత్పత్తులు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతోంది.
ఒక తండ్రి తన కుమార్తె జ్ఞాపకార్థం ప్రారంభించిన చిన్న ప్రయత్నం నేడు వేలాది ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసాగా మారింది. ఆడపిల్లలను గౌరవంగా చూసే సమాజాన్ని నిర్మించడంతో పాటు ప్రకృతిని కాపాడే దిశగా పిపలాంత్రి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. మహిళ సాధికారత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత ఒకేసారి ఎలా సాధ్యమవుతాయో ఈ గ్రామం నిరూపిస్తోంది.
ALSO READ: నేటితో ఆపరేషన్ సింధూర్‌కు ఏడాది పూర్తి