-
గత ఎన్నికల్లో కాంగ్రెస్ చీల్చిన ఓట్లతో గెలుపు
-
చివరి నిమిషంలో కౌశిక్ రెడ్డి సెంటిమెంట్ అస్త్రం
-
ఈసారి ఆ ఛాన్స్ ఉంటుందా…?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక ఖాయం అయ్యింది. మరోవైపు హుజురాబాద్ సైతం ఉప ఎన్నిక ఖాయం అన్న ప్రచారం సాగుతోంది. అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు, ప్రివిలేజ్ కమిటీ విచారణల నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై అనర్హత వేటు ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కౌశిక్ రెడ్డి తో పాటు భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం పరిస్థితి వేరు. అప్పటి రాజకీయ పరిస్థితులు, చివరి నిమిషంలో ఆడిన భావోద్వేగ డ్రామాలు తెచ్చి పెట్టిన అదృష్టమే కౌశిక్ రెడ్డి విజయం అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మారిన రాజకీయం ఒక చిత్రంలో ఆ పాత ఎత్తుగడలు పనిచేసే అవకాశం లేదు. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటేనే ఒక రకమైన భయం గులాబీ పార్టీలో.
పోలింగుకు రెండు రోజుల ముందు…
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు కౌశిక్ రెడ్డి ఒక సెంటిమెంట్ డ్రామాకు తెర తీశారు. పక్కనే తన తల్లి, కుమార్తెను పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు. నాకు ఓట్లేసి గెలిపించకపోతే ఈ నెల మూడున కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం. శవయాత్ర చూస్తారు అంటూ బెదిరింపులకు దిగారు. అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన ఆ వీడియో పై కేసులు నమోదయ్యాయి. ఓటర్లను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిన ఆ వీడియో కౌశిక్ రెడ్డికి ఎంతో లాభం చేకూర్చింది. అటువంటి కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రజలకు విశ్వరూపం చూపడం ప్రారంభించారు. వివాదాస్పద వ్యాఖ్యలు, దాడుల సంస్కృతితో ఎన్నో విమర్శలు మూటగట్టుకున్నారు. అటువంటి సెంటిమెంట్ నాటకాలు మరోసారి ప్రదర్శిస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
స్వల్ప ఓట్లతో గెలుపు…
మొన్నటి ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి స్వల్ప ఓట్లతోనే గెలిచారు. త్రిముఖ పోటీలో నెగ్గుకొచ్చారు. పాడి కౌశిక్ రెడ్డికి 80,033 ఓట్లు వచ్చాయి. ఈటల రాజేందర్ కు 63460 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ కు 53,164 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువగా ఓట్లు చీల్చడం వల్ల కౌశిక్ రెడ్డి గెలవగలిగారు. అప్పట్లో గులాబీ పార్టీ అధికారంలో ఉండడం.. ఈటెల రాజేందర్ 2చోట్ల పోటీ చేయడం వంటి కారణాలతో.. రెండు జాతీయ పార్టీల మధ్య ఓట్లు చీలిపోయాయి. అది కౌశిక్ రెడ్డికి కలిసి వచ్చింది. అయితే గత మూడేళ్లలో పూర్తిగా పరిస్థితి మారిపోయింది. ఇటీవల జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ పూర్తిగా నష్టపోయింది. క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోయింది. ఇటువంటి సమయంలో ఎన్నిక జరిగితే మాత్రం అది కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్న పరిస్థితిలోకి మారడం ఖాయం. ఎందుకంటే హుజూరాబాద్ అంటేనే ఈటెల రాజేందర్ కు గుండెకాయ లాంటిది. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్న.. నియోజకవర్గంలో మాత్రం ఆయన బలం చెక్కుచెదరలేదు. మరోవైపు అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది. అందుకే అక్కడ ఎన్నిక జరిగితే కాంగ్రెస్, బిజెపి తప్ప కౌశిక్ రెడ్డి, బిఆర్ఎస్ ఉండదన్నది విశ్లేషకుల మాట. చూడాలి ఏం జరుగుతుందో.
ఇవి కూడ చదవండి:
-
కొడుకు మరణించినా కోడలికి అండగా నిలిచింది.. మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితం అందించింది…
-
రిషబ్ శెట్టి సినిమాలో ఛాన్స్.. కొత్త నటీనటులకు ఓపెన్ కాస్టింగ్ కాల్
-
ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం.. భాషపై కూడా మెలోనీ సర్కార్ కీలక నిర్ణయం
-
‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో వివాదం.. సంపూర్ణేష్ బాబుకు జర్నలిస్ట్ క్షమాపణలు
