-
మొదటి స్థానంలో నాగాలాండ్, రెండో స్థానంలో బెంగాల్
-
ఏడిఆర్ సంస్థ వెల్లడి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మరో గుర్తింపు సాధించింది. జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. అదేదో గొప్ప విషయంలో మాత్రం కాదు. పార్టీ ఫిరాయింపుల విషయంలో. ఇటీవల దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులు పెరిగిన సంగతి తెలిసిందే. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించడం ఒక పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ గా మారింది. అయితే ఇలా పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్టు.. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ సంస్థ తన నివేదికలో ప్రకటించింది. ఈ ఫిరాయింపుల విషయంలో మొదటి స్థానంలో నాగాలాండ్ ఉంది. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచింది. మూడో స్థానాన్ని తెలంగాణ ఆక్రమించింది. 2022 నుంచి 2026 మధ్యకాలంలో గెలిచిన తర్వాత పార్టీలు మారిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకొని ఏడిఆర్ సంస్థ ఒక రిపోర్టును విడుదల చేసింది.
ఫిరాయింపులకు ప్రోత్సాహం…
ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేదు కానీ.. ఫిరాయింపులను ప్రతి రాజకీయ పార్టీ ప్రోత్సహిస్తోంది. ఎక్కువగా అధికార పార్టీలు విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు ఈ ఫిరాయింపుల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రాంతీయ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే క్రమంలో ఒక మైండ్ గేమ్ ఆడుతూ వచ్చింది. నేరుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను బిజెపిలో చేర్చకుండా.. ప్రాంతీయ పార్టీల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యేక శిబిరం గాను.. లేకుంటే నాయకత్వం మార్పు దిశగా వారిని ప్రోత్సహించడం విశేషం. బిజెపి తన చేతికి మట్టి అంటకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ ఫిరాయింపులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి.
నాగాలాండ్ లో భారీగా…
ఫిరాయింపుల్లో మొదటి స్థానంలో నిలిచిన నాగాలాండ్ లో పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే.. అక్కడ 32 మంది ఎమ్మెల్యేలు నాగాలాండ్ లోని నాగా పీపుల్స్ ఫ్రంట్ లో చేరారు. అదే సమయంలో ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 22 మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు. నేషనల్ లిస్టు సిటిజన్ సాఫ్ట్ ఇండియాలో 20 మంది ఎంపీలు చేరారు. ఇదంతా ఈ నాలుగేళ్ల కాలంలో జరిగింది. అందుకే ఫిరాయింపులలో నాగాలాండ్ తొలి స్థానంలో నిలిచింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో నిలవడం విశేషం. మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బెంగాల్ విపక్ష తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎంపీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఇక మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో గులాబీ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. అయితే ఏడిఆర్ చెబుతున్న గణాంకాల బట్టి చూస్తే.. మొత్తం 111 మంది ఫిరాయింపు ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరూ బీజేపీకి చెందినవారు లేకపోవడం గమనార్హం.
కీలక సూచనలు సైతం…
మరోవైపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వివరాలు వెల్లడించడమే కాదు.. కొన్ని రకాల సూచనలు కూడా చేసింది ఏడిఆర్ సంస్థ. ఫిరాయింపు ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసి అధికారాన్ని స్పీకర్ కు కాకుండా.. రాష్ట్రపతి తో పాటు ఆ రాష్ట్ర గవర్నర్కు అప్పగించాలని చెబుతోంది. అయితే ఇది ఎన్నికల సంఘం సలహా మేరకు జరగాలని చెబుతోంది. అయితే జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ స్థాయిలో తెలంగాణలో ఫిరాయింపులు జరుగుతున్నాయా? అనే బలమైన చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఇదే హార్ట్ టాపిక్ అవుతోంది.
ఇవి కూడ చదవండి
-
కొడుకు మరణించినా కోడలికి అండగా నిలిచింది.. మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితం అందించింది…
-
రిషబ్ శెట్టి సినిమాలో ఛాన్స్.. కొత్త నటీనటులకు ఓపెన్ కాస్టింగ్ కాల్
-
ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం.. భాషపై కూడా మెలోనీ సర్కార్ కీలక నిర్ణయం
-
సంపూర్ణేశ్ బాబు క్లారిటీ.. నాగేంద్ర కుమార్‌తో వివాదంపై హీరో స్పందన
