క్రైమ్ మిర్రర్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో భర్త హత్య కేసు కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధం విషయంలో భర్త ప్రశ్నించడంతో భార్య అతడిని హత్య చేసేందుకు పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం కుమార్తె, ఆమె స్నేహితుడి సహాయంతో మృతదేహాన్ని అటవీ ప్రాంతానికి తరలించి దహనం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మథురకు చెందిన నైనా (40), మనోజ్ సోనీ (42) దంపతులు. నైనా కుమార్తె భక్తికి విమల్ చౌధరి (22) అనే యువకుడితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు మనోజ్ గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై భక్తిని మందలించడంతో పాటు భార్య నైనాతోనూ మనోజ్ తరచూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే మనోజ్‌ను హత్య చేసేందుకు నైనా పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. పథకంలో భాగంగా మత్తు పదార్థం కలిపిన పాలను మనోజ్‌కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. అతడు స్పృహ కోల్పోయిన తర్వాత తలపై బండరాయితో దాడి చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం భక్తి, విమల్ సహకారంతో మృతదేహాన్ని యమునా నది తీరంలోని అటవీ ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్కడ మృతదేహాన్ని దహనం చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు.
మిస్సింగ్ ఫిర్యాదు.. మరుసటి రోజే ఉపసంహరణ
మనోజ్ కనిపించడం లేదంటూ నైనా ఏప్రిల్ 21న పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే మరుసటి రోజే ఎలాంటి స్పష్టమైన కారణం వెల్లడించకుండా ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం నైనా తన పుట్టింటికి వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు మనోజ్ ఆచూకీ లభించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ సమయంలో భక్తి ప్రవర్తనపై ఆమె తాత బ్రజ్‌మోహన్‌కు అనుమానం వచ్చినట్లు తెలుస్తోంది. మనోజ్ కనిపించకపోయినా భక్తిలో పెద్దగా ఆందోళన కనిపించకపోవడంతో ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే హత్యకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. బ్రజ్‌మోహన్ వెంటనే మనోజ్ బంధువులకు, పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. విచారణలో నైనా, భక్తి, విమల్ చౌధరి పాత్రపై అనుమానాలు వ్యక్తమవడంతో ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన వస్తువు, మృతదేహాన్ని తరలించిన విధానం, దహనం చేసిన ప్రదేశం తదితర అంశాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : నటిపై లైంగిక దాడి.. బాలీవుడ్ దర్శకుడు షకీల్ నూరానీ అరెస్ట్
