హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: కూర రుచి నచ్చలేదన్న చిన్న కారణంతో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ విషాదంగా మారింది. భర్త కోపంతో భార్యను తోసేయడంతో ఆమె గోడకు తల బలంగా తగిలి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో చోటుచేసుకుంది. మృతురాలిని 19 ఏళ్ల శిఖాంజలి కుమారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. శిక్షాంజలి కుమారి, చందన్ కుమార్ ఈ ఏడాది ఏప్రిల్ 30న వివాహం చేసుకున్నారు. అనంతరం కాటేదాన్‌లోని శ్రీరామ్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.
కూర రుచి నచ్చలేదని గొడవ…
Also Read:ఆదిలాబాద్ కాంగ్రెస్ లో రచ్చ…!
ఆదివారం రాత్రి శిక్షాజలి తన భర్తకు భోజనం వడ్డించింది. అయితే కూర రుచి సరిగా లేదంటూ చందన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో చందన్ తన భార్యను తోసేశాడని, దీంతో ఆమె అదుపుతప్పి గోడకు తల బలంగా తగిలిందని దర్యాప్తులో వెల్లడైంది. తీవ్రంగా గాయపడిన ఆమెను చందన్ వెంటనే ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు…
Also Read:విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ సినిమాలో టాబు రోల్ ఇదే..!
కుమార్తె మృతి విషయం తెలుసుకున్న శిక్షాంజలి తల్లి సోమవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులు, దంపతుల మధ్య జరిగిన గొడవ, యువతి మృతికి దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.పోలీసుల ప్రకారం, చందన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అతడిపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.చిన్నపాటి కుటుంబ కలహం చివరకు 19 ఏళ్ల యువతి ప్రాణాలను బలిగొనడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
