-
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు
-
పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
-
అన్ని జిల్లాల యంత్రాంగాలకు అప్రమత్తం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారింది. వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాదులో అయితే ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ప్రత్యేక ప్రకటనలు జారీచేసింది. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని 16 జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది.
పది జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్ జారీ చేయడం విశేషం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది ప్రభుత్వం. గత కొద్దిరోజులుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. తాజాగా వర్షాలు పడుతుండడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
-
మరో రెండు రోజులపాటు..
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులపాటు ఇవి కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్రవాయుగుండం బుధవారం నాటికి దక్షిణ జార్ఖండ్, ఉత్తర చత్తీస్గడ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.
రుతుపవన ద్రోణి ఒకటి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే వాతావరణ శాఖ అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు.
-
ఈదురు గాలులు సైతం..
మరోవైపు తెలంగాణలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరో అప్డేట్ ఇచ్చింది. వర్షాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని… ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా పిలుపునిస్తున్నారు.
ఒకవేళ బయటకు రావాలనుకున్న వారు తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలతో మాట్లాడింది. కీలక ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.
