క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్క అసెంబ్లీలో వెల్లడించిన ప్రకారం, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక లక్ష కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. తాజా నిర్ణయంతో మరో 2 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
కొత్త పెన్షన్ల కోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేసే బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు అప్పగించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం ₹233 కోట్లను కేటాయించింది.
ప్రస్తుత పెన్షన్ల వివరాలు:
రాష్ట్రంలో ప్రస్తుతం 42.23 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు పొందుతున్నారు.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత మరియు చేనేత కార్మికులు, ఎయిడ్స్ (HIV) వ్యాధిగ్రస్తులు, మరియు బోదకాలు బాధితులకు నెలకు ₹2,016 చొప్పున పెన్షన్ అందుతోంది.
దివ్యాంగులకు నెలకు ₹4,016 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది.