క్రైమ్ మిర్రర్ : మహేశ్వరం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్న పోలీసులు ఆమనగల్లు పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 35 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.17.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం ప్రాంతానికి చెందిన అభి అనే వ్యక్తి గంజాయిని ఆమనగల్లుకు తరలించి డెలివరీ చేస్తే ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెల్లిస్తానని నిందితులకు ఆఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఒప్పందానికి అంగీకరించిన కుంజం చందు బాబు దొర (26), కోసు వెంకట సాయి బాబు దొర (23) గంజాయిని తీసుకుని ఆమనగల్లు బయలుదేరినట్లు పేర్కొన్నారు.
రాజమండ్రి మీదుగా హైదరాబాద్ వైపు ప్రయాణించిన ఇద్దరు నిందితులు అక్టోబర్ 6న మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు ఆమనగల్లు మార్కెట్‌యార్డుకు చేరుకున్నారు. అక్కడ గంజాయిని తీసుకునేందుకు రావాల్సిన వ్యక్తి కోసం వేచి ఉన్న సమయంలో పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
సమాచారం ఆధారంగా పోలీసులు ఆమనగల్లు మార్కెట్‌యార్డు వద్దకు చేరుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తనిఖీలు నిర్వహించగా 17 ప్యాకెట్లలో దాచిన 35 కిలోల గంజాయి బయటపడింది. దీంతో గంజాయితో పాటు ఒక మొబైల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలించాల్సి ఉంది? ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న అభి ఆచూకీ కోసం కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా మహేశ్వరం డీసీపీ కె. నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు. మత్తు పదార్థాల కదలికలపై అనుమానం కలిగితే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఎస్‌ఓటీ అదనపు డీసీపీ సైక్ జహంగీర్, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఆమనగల్లు ఇన్‌స్పెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్‌ఓటీ ఎస్‌ఐ సురేష్‌తో పాటు పోలీస్‌స్టేషన్ సిబ్బందిని డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు.
also read: వైద్యం పేరుతో యువతిపై అసభ్య ప్రవర్తన.. డాక్టర్ అరెస్ట్
