రాజస్థాన్‌లో ఓ భారీ ట్రైలర్ డ్రైవర్ చేసిన ప్రమాదకర విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కదులుతున్న వాహనాన్ని నడుపుతూనే స్టీరింగ్‌ను వదిలేసి క్యాబిన్ పైకి ఎక్కి డ్యాన్స్ చేయడం, వాహనం కిటికీ వద్ద వేలాడుతూ స్టంట్స్ చేయడం వంటి దృశ్యాలు వీడియోలో కనిపించాయి.
అల్వార్‌లోని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోహియా తిబారా సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రోడ్డుపై భారీ ట్రైలర్ వెళ్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా స్టీరింగ్ వదిలి క్యాబిన్ టాప్‌పైకి ఎక్కాడు. అక్కడ కొంతసేపు డ్యాన్స్ చేసిన అనంతరం తిరిగి క్యాబిన్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ బయటకు వచ్చి డోర్ విండోపై వేలాడుతూ ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు.
ఈ దృశ్యాలను చూసిన ఇతర వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి, ట్రైలర్‌కు దూరంగా తమ వాహనాలను నడిపారు.
కాగా, ఈ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. డ్రైవర్ తన ప్రాణాలను మాత్రమే కాకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు, పాదచారుల భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టాడని మండిపడుతున్నారు.
ప్రమాదకరంగా వాహనం నడిపిన డ్రైవర్‌ను గుర్తించి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
also read: విషాదం.. బస్సు హైడ్రాలిక్ డోర్‌లో బాలుడి తల ఇరుక్కుని మృతి
