Homeక్రైమ్విషాదం.. బస్సు హైడ్రాలిక్ డోర్‌లో బాలుడి తల ఇరుక్కుని మృతి

విషాదం.. బస్సు హైడ్రాలిక్ డోర్‌లో బాలుడి తల ఇరుక్కుని మృతి

గుజరాత్‌లోని వడోదరలో విషాద ఘటన చోటుచేసుకుంది. రిపేర్‌ కోసం గ్యారేజీ వద్ద నిలిపి ఉంచిన ఓ లగ్జరీ బస్సు హైడ్రాలిక్‌ డోర్‌లో తల ఇరుక్కుపోవడంతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సీసీటీవీ ఫుటేజ్‌లో కీలక సమయం రికార్డు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

శివారు ప్రాంతంలోని ఓ గ్యారేజీ వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సును రిపేర్‌ కోసం నిలిపి ఉంచారు. బుధవారం సాయంత్రం సమీపంలో నివసించే కూలీ కుటుంబానికి చెందిన ఏడేళ్ల దివ్వేష్‌ రాత్వ అక్కడ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ బస్సు హైడ్రాలిక్‌ డోర్‌లో అతడి తల ఇరుక్కుపోయింది.

ఈ విషయాన్ని గమనించిన గ్యారేజీ యజమాని సీసీటీవీ ద్వారా గుర్తించి సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే ఇద్దరు సిబ్బంది అక్కడికి చేరుకుని డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. డోర్‌ను బలంగా తోయడంతో బాలుడు కిందపడిపోయాడు. వెంటనే బాలున్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అనంతరం గ్యారేజీ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే బాలుడి తల డోర్‌లో ఇరుక్కోవడానికి ముందు, ఆ తర్వాతి దృశ్యాలు మాత్రమే కెమెరాలో కనిపించగా.. ప్రమాదానికి సంబంధించిన కీలక మధ్యంతర సమయం రికార్డు కాలేదని పోలీసులు గుర్తించారు.

దీంతో సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డింగ్‌ మిస్‌ కావడంపై కూడా పోలీసులు దృష్టి సారించారు. బాలుడి మృతికి అసలు కారణమేంటి? ప్రమాదం ఎలా జరిగింది? సీసీటీవీ ఫుటేజ్‌లో కీలక దృశ్యాలు ఎందుకు లేవన్న అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

also read: “మేకర్స్‌పై నమ్మకం ఉంచడం ప్రభాస్ ప్రత్యేకత”- నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు