కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసిన ఓ ఘటన పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని జైలు నుంచి బయటకు తీసుకొస్తానని నమ్మించిన ఓ జైలు ఉద్యోగి.. అతడి భార్యపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు తయారు చేసి, ఆ ఖైదీని అక్రమంగా విడుదల చేసిన వ్యవహారం తాజాగా బయటపడింది.
ఈ కేసు బెంగళూరు సెంట్రల్ జైలులో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కర్ణ బి. క్షేత్రి ఈ ఏడాది మే 20న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శంకర్ అనే ఖైదీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల పేరుతో రూపొందించిన నకిలీ పత్రాన్ని సమర్పించి 2018 నవంబర్ 13న జైలు నుంచి విడుదలైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో పరప్పన అగ్రహార పోలీసులు మోసం, నకిలీ పత్రాల తయారీ, వాటిని నిజమైనవిగా ఉపయోగించడం తదితర ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 465, 468, 471, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భర్తను విడిపిస్తానంటూ..
పోలీసుల దర్యాప్తులో గత ఘటనలకు సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి. చిక్కపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో శంకర్‌కు 2004లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ అతడు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఉపశమనం లభించలేదని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో భర్తను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అతడి భార్య ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో సెంట్రల్ జైలులో సెకండ్ డివిజన్ అసిస్టెంట్‌గా పనిచేసిన శ్రీకాంత్‌ను ఆమె సంప్రదించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం అతడు ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భర్తను విడుదల చేయిస్తానని చెప్పి శ్రీకాంత్ ఆమెను నమ్మించాడని, ఈ క్రమంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
సుప్రీంకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు
ఆ తర్వాత 2018 నవంబర్ 2న సుప్రీంకోర్టు జారీ చేసినట్లుగా కనిపించే ఓ నకిలీ ఉత్తర్వును శ్రీకాంత్ రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. ఆ పత్రాన్ని ఆధారంగా చేసుకుని నవంబర్ 13, 2018న శంకర్‌ను బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా శంకర్‌తో పాటు జైలు ఉద్యోగి శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
డీఐజీ స్థాయి అధికారిపైనా ఆరోపణలు
ఈ కేసు విచారణలో ఖైదీ భార్య ఇచ్చిన వాంగ్మూలంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది. తన భర్తను విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అప్పటి చీఫ్ సూపరింటెండెంట్/డీఐజీగా పనిచేసిన సోమశేఖర్ కూడా తనను లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించింది.
ఈ ఆరోపణలను కూడా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోమశేఖర్‌పై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్ సిటీ డివిజన్ డీసీపీ ఎం. నారాయణ పర్యవేక్షణలో మొత్తం కేసును పోలీసులు విచారిస్తున్నారు.
నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆధారంగా యావజ్జీవ ఖైదీ విడుదల కావడం, జైలు ఉద్యోగిపై లైంగిక దాడి ఆరోపణలు రావడం, ఉన్నత స్థాయి జైలు అధికారిపైనా ఫిర్యాదు నమోదవడం బెంగళూరులో తీవ్ర చర్చకు దారితీసింది.
also read: గచ్చిబౌలిలో యువతి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌పై అనుమానాలు
