సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల భూముల సర్వే నివేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325కు సంబంధించిన భూముల వివరాలను అధికారులు సీఎంకు వెల్లడించారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదై ఉండగా.. క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో మాత్రం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రికార్డుల్లో ఉన్న భూమికి, క్షేత్రస్థాయిలో గుర్తించిన భూమికి మధ్య ఉన్న 45 ఎకరాల వ్యత్యాసంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను వివరాలు కోరారు. ఈ భూమి ఆచూకీని వెంటనే తేల్చాలని ఆదేశించారు.
గ్రామాలకు సర్వే నోటిఫికేషన్లు
ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాలకు సంబంధించి సర్వే నోటిఫికేషన్లు జారీ చేసి భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని సీఎం సూచించారు. అలాగే సంబంధిత రెవెన్యూ రికార్డులను సమర్పించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
అమరవీరుల కుటుంబాలకు భూములు
సర్వే నంబర్ 325లో గుర్తించే భూమిని అమరవీరుల కుటుంబాల కోసం వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ ప్రాంతంలో ‘అమరవీరుల కాలనీ’ ఏర్పాటు చేసి, అర్హులైన అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులకు సూచించారు.
కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని నిర్ణయించారు. నిర్మాణ పనులను జూన్ 2లోగా పూర్తి చేయాలని సీఎం గడువు విధించారు.
గత ఆదేశాల మేరకే సర్వే
కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లోని ప్రభుత్వ, అసైన్డ్ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీలో అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎర్రవల్లి, వెంకటాపురం ప్రాంతాల్లో ఇటీవల భూములపై సర్వే నిర్వహించారు. తాజాగా ఆ సర్వేకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో సీఎం దానిపై సమీక్ష నిర్వహించారు.
also read: తేజ సజ్జాకు కొత్త బాధ్యతలు.. ‘ది ట్రెయిటర్స్ తెలుగు’తో హోస్ట్‌గా ఎంట్రీ!
