HomeజాతీయంNew Diesel Rules: డీజిల్‌పై కేంద్రం కొత్త ఆంక్షలు.. ఇక రోజుకు ఎన్ని లీటర్లు పోస్తారంటే?

New Diesel Rules: డీజిల్‌పై కేంద్రం కొత్త ఆంక్షలు.. ఇక రోజుకు ఎన్ని లీటర్లు పోస్తారంటే?

Diesel Purchase Restricted: దేశ వ్యాప్తంగా డీజిల్‌ వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ అమ్మకాలపై కొన్ని పరిమితులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బల్క్‌ వినియోగదారులు భారీ స్థాయిలో రిటైల్‌ బంకుల నుంచి డీజిల్‌ కొనుగోలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

సాధారణ బంకుల్లో ఎక్కువ కొనుగోళ్లు

ప్రస్తుతం బల్క్‌ వినియోగదారులకు విక్రయించే డీజిల్‌ ధర లీటరుకు రూ.134.50గా ఉండగా, సాధారణ పెట్రోల్‌ బంకుల్లో అదే డీజిల్‌ ధర సుమారు రూ.95.20గా ఉంది. ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటంతో ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌, నిర్మాణ సంస్థలు, పరిశ్రమలు వంటి బల్క్‌ వినియోగదారులు తక్కువ ధర కోసం నేరుగా రిటైల్‌ బంకులకు వెళ్లి డీజిల్‌ పోయించుకుంటున్నట్లు కేంద్రం గుర్తించింది. దీని వల్ల సాధారణ వాహనదారులకు డీజిల్‌ అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చమురు మార్కెటింగ్‌ సంస్థలకు కూడా ఆర్థిక నష్టం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్త ఆంక్షలను అమలు చేస్తున్నారు.

ఇకపై 200 లీటర్లకు పరిమితం!

కొత్త నిబంధనల ప్రకారం ఒక వాహనం లేదంటే ఒక వినియోగదారుకు రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్‌ మాత్రమే పోస్తారు. బంకుల్లో డీజిల్‌ ను నేరుగా వాహనంలోనే నింపాలి. ఒకవేళ కంటెయినర్‌ లో తీసుకెళ్లాల్సి వస్తే, పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (PESO) అనుమతించిన కంటెయినర్లను మాత్రమే ఉపయోగించాలి. సాధారణ ప్లాస్టిక్‌ డబ్బాలు లేదా ఇతర అనుమతి లేని పాత్రల్లో డీజిల్‌ నింపడానికి అనుమతి ఉండదు. అలాగే బంకుల నుంచి కొనుగోలు చేసిన డీజిల్‌ను ఇతరులకు విక్రయించడం కూడా నిషేధించారు.

కొత్త నిబంధనలు 90 రోజుల పాటు అమలు

ఇక పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత అవసరాల కోసం పెద్ద మొత్తంలో ఇంధనం వినియోగించే సంస్థలు ఇకపై సాధారణ బంకుల్లో డీజిల్‌ కొనుగోలు చేయలేవు. వారు తమ సంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక బంకులు, అధికారిక సరఫరా వ్యవస్థల ద్వారానే ఇంధనం పొందాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ప్రస్తుతం 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి. అవసరమైతే వీటి గడువును కేంద్ర ప్రభుత్వం మరింత పొడిగించే అవకాశముంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు