Homeక్రైమ్Tinder Scam: ప్రేమ పేరుతో లేడీ జడ్జికి వల.. ఏకంగా రూ.52 లక్షలు కొట్టేసిన కేటుగాడు!

Tinder Scam: ప్రేమ పేరుతో లేడీ జడ్జికి వల.. ఏకంగా రూ.52 లక్షలు కొట్టేసిన కేటుగాడు!

Tinder Romance Ends in Fraud: ఆన్ లైన్ కేటుగాళ్లు సామాన్యులనే కాదు, ఏకంగా జడ్జీలను కూడా వదలడం లేదు. తాజాగా ఓ డేటింగ్ యాప్ లో మహిళా జడ్జితో పరిచయం పెంచుకుని.. రూ. 52 లక్షలు కొట్టేశాడు. తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అంతా షాకయ్యారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

చండీగఢ్‌ కు చెందిన ఓ మహిళా న్యాయాధికారి  డేటింగ్ యాప్ టిండర్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఆమెను నమ్మించి రూ.52 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు . 2025 నవంబర్‌ లో టిండర్ యాప్ ద్వారా మహిళా న్యాయాధికారికి దీపక్ వాట్స్ అనే వ్యక్తి  అభిమన్యు పేరుతో పరిచయమయ్యాడు. తాను కేంద్ర ప్రభుత్వంలోని ఓ సీక్రెట్ ఏజెన్సీలో పనిచేస్తున్నానని చెప్పి ఆమెను నమ్మించాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.

ఈ సమయంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నిందితుడు ఆమెను నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన సదరు లేడీ జడ్జి విడతల వారీగా మొత్తం రూ.52 లక్షలను అతడు చెప్పిన అకౌంట్స్ కు పంపించింది. అయితే, డబ్బులు పెట్టిన తర్వాత ఎలాంటి లాభాలు రాకపోగా, తనకు మోసం జరిగిందని ఆమె గ్రహించారు.

పని మనిషి పేరుతో ఫిర్యాదు

తన వ్యక్తిగత వివరాలు బయటకు రావద్దనే ఉద్దేశంతో, మోసానికి గురైన వ్యక్తిగా తన ఇంటి పనిమనిషి దీక్షాదేవి పేరుతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు మహిళా న్యాయమూర్తి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. ఇటీవల నిందితుడు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా విచారణ సందర్భంగా అసలు విషయం బయటపడింది. ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా మోసపోయింది పనిమనిషి కాదని, మహిళా న్యాయాధికారే అని వెల్లడైంది. కోర్టులో నిందితుడు తన వాదనలు వినిపిస్తూ తాము కొన్ని నెలలుగా రిలేషన్‌ షిప్‌ లో ఉన్నామని తెలిపాడు. అలాగే డబ్బులు పెట్టుబడుల కోసం కాకుండా బెట్టింగ్ కార్యకలాపాల్లో పెట్టాలని మహిళా న్యాయాధికారే స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం చండీగఢ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు