Homeజాతీయంసుప్రీంకోర్టులోను మీనాక్షి నటరాజన్‌కు నిరాశ.. విచారణ రేపటికి వాయిదా..

సుప్రీంకోర్టులోను మీనాక్షి నటరాజన్‌కు నిరాశ.. విచారణ రేపటికి వాయిదా..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంలో గురువారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన నామినేషన్‌ను రద్దు చేస్తూ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆమె భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు వెంటనే స్వీకరించడానికి నిరాకరించింది. “రేపు రండి.. రేపే విచారణ చేపడతాం” అంటూ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. మీనాక్షి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వి, ఈ అంశంలో అత్యవసర జోక్యం అవసరమని వాదించారు. నామినేషన్ల ప్రక్రియకు ఈరోజే చివరి రోజు కావడంతో తక్షణ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 33ఏను కూడా ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అయితే రిటర్నింగ్ అధికారి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోతంగి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం జస్టిస్ ప్రశాంత్ కుమార్, ఈ విషయంలో ఇప్పటికే స్పష్టమైన న్యాయపరమైన మార్గదర్శకాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అశోక్ కుమార్ కేసు తీర్పులో ఈ అంశంపై స్పష్టత ఉందని పేర్కొంటూ, శుక్రవారం పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. ఈ వివాదానికి కారణం ఫారం-26లో సమర్పించాల్సిన వివరాలే. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తనపై ఉన్న అన్ని క్రిమినల్ కేసుల పూర్తి సమాచారాన్ని ఫారం-26లో తప్పనిసరిగా వెల్లడించాలి. కేసులు లేకపోయినా సంబంధిత కాలమ్‌లను ఖాళీగా వదిలివేయకుండా “నిల్” లేదా “నాట్ అప్లికబుల్” అని నమోదు చేయాలి. అయితే తెలంగాణలో తనపై పెండింగ్‌లో ఉన్న ఒక కేసుకు సంబంధించిన వివరాలను మీనాక్షి నటరాజన్ ఫారం-26లో పేర్కొనలేదని రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ గుర్తించారు. దీంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. బుధవారం కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌ను కలిసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చివరి మార్గంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీనాక్షి నటరాజన్, రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో, ఈ కేసులో శుక్రవారం జరిగే విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు