-
సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ పై ఫోకస్
-
ముందుగా కేటీఆర్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ
-
ఆ తరువాత రెండు నియోజకవర్గాలపై
-
గులాబీ పార్టీ అగ్రనేతల కట్టడికి గట్టి ప్రయత్నాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ కంచుకోటలపై రేవంత్ దృష్టి పెట్టారా? ఎలాగైనా అక్కడ కాంగ్రెస్ జెండా పాతాలని చూస్తున్నారా? అందులో భాగమే సిరిసిల్ల సభా? పొలిటికల్ వార్ కు అది ట్రైలరా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.
2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి గులాబీ పార్టీ అగ్రనేతల కంచుకోటలను బద్దలు కొట్టాలన్న ఆలోచనలు సీఎం రేవంత్ ఉన్నారు. సిరిసిల్లతో మొదలుపెట్టి సిద్దిపేట, గజ్వేల్ వైపు దండయాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నారు రేవంత్. ముందుగా కేటీఆర్ కోటలో రాజకీయ రణభేరి నిర్వహించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వనున్నారు.
-
రేవంత్ పై వ్యక్తిగత ఫోకస్..
గత కొంతకాలంగా చూస్తే కాంగ్రెస్ వర్సెస్ గులాబీ పార్టీ అనేకంటే.. రేవంత్ వర్సెస్ కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు పరిస్థితి ఉంది. ఎలాగైనా రాజకీయంగా రేవంత్ ను దెబ్బతీయాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు ఆ ఇద్దరు నేతలు. అయితే అదే దూకుడుతో ఉన్నారు సీఎం రేవంత్. సెప్టెంబర్ 30న సిరిసిల్లలో నిర్వహించనున్న సభ ద్వారా కేటీఆర్ పై విరుచుకుపడనున్నారు.
కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో భారీ సభ నిర్వహించడం వెనుక.. కేవలం అభివృద్ధి కార్యక్రమాల అజెండా లేదు. పొలిటికల్ అజెండా ఉన్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు కిలోమీటర్ల రోడ్డు షో, భారీ బహిరంగ సభ, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతల మోహరింపుతో సిరిసిల్లను కాంగ్రెస్ రాజకీయ శక్తి ప్రదర్శనకు వేదికగా మార్చే ప్రయత్నం గా కనిపిస్తోంది.
-
ఇమేజ్ ను డామేజ్ చేసే ప్రయత్నం..
సిరిసిల్లలో కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్ను దెబ్బతీసేందుకే రేవంత్ ప్రయత్నం అని విశ్లేషకులు భావిస్తున్నారు. 2009,2014, 2018 2023, ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు కేటీఆర్. ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ చేయడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ కు కష్టమే అన్న సంకేతాలు పంపించాలని రేవంత్ భావిస్తున్నారు.
ఇది కేవలం కేటీఆర్ తో రాజకీయ పోరుగా కాకుండా.. భారత రాష్ట్ర సమితి క్యాడర్ లో ఉన్న రాజకీయ ఆధిక్య భావనను దెబ్బతీయాలన్న వ్యూహంగా కనిపిస్తోంది. సిరిసిల్ల సభకు వచ్చే జనస్పందన, కాంగ్రెస్ శ్రేణుల సమీకరణ, స్థానిక నాయకత్వం పనితీరు.. ఇవన్నీ రాబోయే రాజకీయ వ్యూహాలకు ఒక పరీక్ష గా మారనున్నాయి.
-
ఆ రెండు చోట్ల సైతం..
అయితే ఒక్క సిరిసిల్ల మాత్రమే కాదు. సిద్దిపేట తో పాటు గజ్వేల్ పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. హరీష్ రావు తో పాటు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వరుసగా సభలు, సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం మాత్రమే కాదు.. గులాబీ పార్టీ అగ్రనేతల అవినీతి పాలనను కూడా తెలియజెప్పేందుకు ఈ సభలను రేవంత్ ఒక వేదికగా మార్చుకునే అవకాశం ఉంది.
రాజకీయంగా వారిని దెబ్బతీసి.. మరోసారి తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు ఒక వ్యూహంగా కనిపిస్తోంది. 30న సిరిసిల్లలో సభ పూర్తవగానే సిద్దిపేట తో పాటు గజ్వేల్ లో సైతం సభల నిర్వహణకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
-
పక్కా రాజకీయ వ్యూహం
పక్కా పొలిటికల్ వ్యూహంతోనే ఈ మూడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ముగ్గురు అగ్ర నేతలను సొంత నియోజకవర్గాలకు పరిమితం చేసి.. చేతులు కట్టేయాలన్నది ప్లాన్. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా మిగతా నియోజకవర్గాలకు పెద్దగా సమయం కేటాయించలేరు కాబట్టి.. పక్కా ప్రణాళికతో రేవంత్ రెడ్డి ఈ వ్యూహానికి తెర తీసినట్లు సమాచారం.
అయితే ఈ విషయాన్ని గమనించిన కేటీఆర్ కూడా ఎదురుదాడికి దిగారు. సిరిసిల్ల సభకు ముందుగానే నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మొత్తానికైతే 2028 ఎన్నికలకు సంబంధించి పొలిటికల్ వార్ ముందే మొదలైంది.
