క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :-తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా వేసవి సెలవుల ముగింపు దశలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.భక్తుల సౌకర్యాలను పెంపొందించడం, పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా టీటీడీ ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. తిరుమలలో విస్తరించి ఉన్న వివిధ విభాగాల కార్యాలయాలను ఒకే చోట సమీకరించేందుకు “సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్” నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
దాదాపు రూ. 85 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి టీటీడీ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తిరుమలలో ఉన్న అనేక విభాగాలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. దీంతో పరిపాలనలో సమన్వయం లోపించడం, సేవలలో ఆలస్యం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పైగా కొన్ని కార్యాలయాలు తాత్కాలికంగా కాటేజీల్లోనే కొనసాగుతున్నాయి.ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 24 విభాగాలను ఒకే భవనంలో ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అదనపు ఈవో కార్యాలయం, ఆలయ విభాగం, అన్నప్రసాదం, కల్యాణకట్ట, పరకామణి, మ్యూజియం, అర్బన్ ప్లానింగ్ వంటి కీలక విభాగాలు ఈ భవనంలోనే పనిచేయనున్నాయి.
అమెరికాలో కాల్పులకి బలైన తెలంగాణ యువకుడు
ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణానికి బీ-టైప్ క్వార్టర్స్ ఉత్తరభాగంలో సుమారు 1.35 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతం రింగ్ రోడ్, క్యూ లైన్లకు సమీపంలో ఉండటం వల్ల భక్తులకు, సిబ్బందికి సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే పార్కింగ్ సౌకర్యాలు కూడా మెరుగ్గా కల్పించే అవకాశం ఉంది.మొదటగా ఈ ప్రాజెక్టును అన్నపూర్ణ క్యాంటీన్ సమీపంలో నిర్మించాలని యోచించినప్పటికీ, ఆ స్థలం పరిమితంగా ఉండటంతో అన్ని కార్యాలయాలను అక్కడ ఏర్పాటు చేయడం కష్టమని అధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో కొత్త ప్రదేశాన్ని ఖరారు చేశారు.
నాలుగు అంతస్తులతో నిర్మించనున్న ఈ భవనాన్ని పూర్తిగా గ్రీన్ బిల్డింగ్‌గా రూపకల్పన చేయనున్నారు. సోలార్ పవర్ సిస్టమ్, పర్యావరణహిత నిర్మాణ విధానాలతో ఈ భవనం నిర్మించబడుతుంది. పచ్చదనాన్ని కాపాడేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనున్నారు.ఇందులో ఆధునిక మీటింగ్ హాల్స్, మినీ థియేటర్ వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. డిజైన్లు పూర్తయిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి, త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.
ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే తిరుమలలో పరిపాలన మరింత సులభతరం కావడంతో పాటు భక్తులకు వేగవంతమైన సేవలు అందే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నిర్ణయం తిరుమల అభివృద్ధికి మరో పెద్ద అడుగుగా భావిస్తున్నారు.