అమరావతి, క్రైమ్‌మిర్రర్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజధాని అమరావతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న అమరావతి రాజధాని అనేది ఎప్పటికీ వాస్తవం కాలేదని, అది కేవలం ఒక ఊహ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. మావిగన్ ఇప్పటికే అన్ని వసతులతో కూడిన ఒక పూర్తిస్థాయి నగరమని జగన్ స్పష్టం చేశారు. రాజధానిగా ప్రకటించిన మొదటి రోజు నుంచే అక్కడ పరిపాలన సాగించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం, 4 జాతీయ రహదారులు మరియు 3 రైల్వే స్టేషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన 9 మెడికల్ కాలేజీలు ఈ ప్రాంతంలో సేవలందిస్తున్నాయి.
ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఇప్పటికే అక్కడ విస్తరించి ఉన్నాయి. కేవలం 10 శాతం ఖర్చుతోనే పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం ఆవుతుందన్నారు. “అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాల కోసమే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ మావిగన్ లో కేవలం కనెక్టివిటీ (రహదారుల అనుసంధానం) మెరుగుపరిస్తే సరిపోతుంది.
రాబోయే 5 నుండి 8 ఏళ్లలో కేవలం రూ. 15,000 కోట్ల నుండి రూ. 20,000 కోట్లు ఖర్చు చేస్తే మావిగన్ న్ని అద్భుతమైన రాజధానిగా మార్చవచ్చు. ఇది అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం 10 శాతం మాత్రమే.” అని జగన్ వివరించారు. మావిగన్ న్ని రాజధానిగా అంగీకరించి, ప్రభుత్వ భవనాలను అక్కడికి తరలిస్తే మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్‌కు ఒక పూర్తిస్థాయి రాజధాని ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలా కాకుండా అమరావతిలోనే రాజధాని కట్టాలనుకుంటే.. ఒకటి కాదు, రెండు కాదు, మూడు దశాబ్దాలు (30 ఏళ్లు) గడిచినా ఆంధ్రప్రదేశ్‌కు సొంత రాజధాని లేని పరిస్థితే ఉంటుందని జగన్‌మోహన్ రెడ్డి హెచ్చరించారు