క్రైమ్ మిర్రర్ : గుజరాత్‌లోని వడోదరలో విషాద ఘటన చోటుచేసుకుంది. రిపేర్ కోసం గ్యారేజీ వద్ద నిలిపి ఉంచిన లగ్జరీ బస్సు హైడ్రాలిక్ డోర్‌లో తల ఇరుక్కోవడంతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్‌లో కీలకమైన సమయం రికార్డు కాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సును రిపేర్ కోసం నగర శివారులోని ఓ గ్యారేజీ వద్ద నిలిపి ఉంచారు. అదే ప్రాంతంలో నివసించే కూలీ కుటుంబానికి చెందిన ఏడేళ్ల దివ్వేష్ రాత్వ బుధవారం సాయంత్రం బస్సు సమీపంలో ఆడుకుంటున్నాడు.
ఈ సమయంలో అనుకోకుండా బాలుడి తల బస్సు హైడ్రాలిక్ డోర్‌లో ఇరుక్కుపోయింది. గ్యారేజీ యజమాని సీసీటీవీ ద్వారా ఘటనను గమనించి వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు సిబ్బంది అక్కడికి చేరుకుని డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాలుడి తల బయటకు వచ్చినా అతడు తీవ్రంగా గాయపడి కిందపడిపోయాడు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో కీలక భాగం మిస్సింగ్
పోలీసులు గ్యారేజీ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. బాలుడి తల బస్సు డోర్‌లో ఇరుక్కోవడానికి ముందు, అనంతరం జరిగిన పరిణామాలు మాత్రమే రికార్డయినట్లు పోలీసులు గుర్తించారు. మధ్యలో జరిగిన కీలక పరిణామాలకు సంబంధించిన దృశ్యాలు ఫుటేజ్‌లో కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి మృతికి దారితీసిన అసలు కారణాన్ని నిర్ధారించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
also read : సినిమాల్లోకి కేటీఆర్ తనయుడు…!
